విశాఖ స్టీల్ పనితీరుపై ఉక్కు శాఖ కొత్త మంత్రి రామ్‌చంద్ర ప్రసాద్ సింగ్ మంగళవారం సమీక్షించారు. సంస్థ ఖర్చులు తగ్గించుకొని ఉత్పాదకత పెంచుకోవాలని సూచించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంత్రి వివిధ ఉక్కు పరిశ్రమల పనితీరు సమీక్షిస్తున్నారు. మంగళవారం విశాఖ స్టీల్‌తోపాటు దాని అనుబంధ సంస్థలైన బీఎస్‌ఎల్‌సీ, ఓఎండీసీ మరికొన్ని సంస్థల పనితీరు తెలుసుకున్నారు. కార్యక్రమంలో విశాఖ స్టీల్ సీఎండీ పాల్గొని సంస్థ భౌతిక, ఆర్థిక పనితీరు వివరించారు.
ప్రస్తుతం సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రధాన ప్రాజెక్టులు, మొదలుపెట్టిన పనులు, సంస్థకున్న ఇబ్బందులు, వాటిని అధిగమించడానికి అనుసరించాల్సిన విధానాలు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్‌ఐఎన్‌ఎల్ పరిధిలోని ఫోర్జ్‌డ్ వీల్ ప్లాంట్ నిర్వహణ గురించి ఆరా తీశారు. పనితీరు మెరుగు పర్చుకోవడానికి విశాఖ స్టీల్ తరుఫున మొదలుపెట్టిన పనులను సమీక్షించారు. ఖర్చును తగ్గించుకొని ఉత్పాదకత పెంచుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. బీఎస్‌ఎల్‌సీ ఆర్థిక పనితీరు, అక్కడి నుంచి జరుగుతున్న ఉత్పత్తి గురించి సీఎండీ కేంద్రమంత్రికి వివరించారు.
ఇదీ చదవండి: VISAKHA STEEL PLANT: ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక, ప్రజాసంఘాల భారీ ర్యాలీ