కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణకు లాభనష్టాలు కొలమానం కాదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌కు తెలిపారు. ప్రైవేటీకరణ ద్వారా వచ్చిన వనరులను వివిధ సామాజిక, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించడమే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలకు ప్రధాన కారణం.. ప్రత్యక్ష, పరోక్ష వ్యయాలు, అప్పులపై అధికవడ్డీలు, తక్కువ ఉత్పాదకత, వినియోగ సామర్థ్యమేనని నిర్మలా స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలను దృష్టిలో ఉంచుకొని... విశాఖ స్టీల్‌తోపాటు, దాని అనుబంధ, సంయుక్త వ్యాపార భాగస్వామ్య సంస్థలన్నింటిలో ప్రైవేటీకరణ రూపంలో 100% వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించినట్లు లోకసభకు నిర్మలా తెలియజేశారు. జనవరి 27న జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఇందుకు ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదముద్ర కూడా వేసినట్లు.. లోక్‌సభలో వైకాపా సభ్యుడు బాలశౌరి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు నిర్మలా.
ఉత్పాదకత పెంచాలన్నదే లక్ష్యం
కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమలు, ఆర్థిక సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ, మైనార్టీ వాటాల విక్రయం ద్వారా 2021-22లో రూ.1.75 లక్షల కోట్ల ఆదాయం ఆర్జించాలని బడ్జెట్‌లో అంచనా వేసినట్లు ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల ఉత్పాదకత పెంచి వాటి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడమే ప్రైవేటీకరణ వెనకున్న ప్రధాన కారణమని.. ప్రైవేటు మూలధనం, టెక్నాలజీ, ఇన్నోవేషన్, అత్యుత్తమ యాజమాన్య పద్ధతులను ప్రవేశపెట్టడం ద్వారా వాటి ఉత్పాదకత పెంచాలన్నదే ప్రైవేటీకరణ ఉద్దేమని తన సమాధానంలో తెలిపారు.
ప్రభుత్వరంగ సంస్థల డిపార్ట్‌మెంట్ ప్రకారం 84 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (వాటి మాతృ, అనుబంధ సంస్థలతోసహా) 2019-20లో నష్టాలు మూటగట్టుకున్నాయని మంత్రి తెలిపారు. ఒక్కో సంస్థ నష్టాలకు ఒక్కో రకమైన కారణం ఉందని.. అయితే ఈ సంస్థల నష్టాలు, ఖాయిలాకు కనిపించే ఉమ్మడి కారణం మాత్రం మూలధన కొరత, పాతకాలపు ప్లాంట్ అండ్ మిషనరీ, కాలం చెల్లిన టెక్నాలజీ, తక్కువ వినియోగ సామర్థ్యం, తక్కువ ఉత్పాదకత, ఆస్తులు, అప్పుల వాటా, నిర్మాణం సరిగా లేకపోవడం, ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉండటం, బలహీనమైన మార్కెటింగ్ వ్యూహాలు, మార్కెట్‌లో ఎదురయ్యే పోటీని ఎదుర్కొనే సత్తా లేకపోవడం, ఇన్నోవేషన్ కొరవడటం, ప్రభుత్వ ఆర్డర్లపై అత్యధికంగా ఆధారపడటమే అని లిఖితపూర్వక సమాధానంలో నిర్మలాసీతారామన్ వివరించారు.
ఇదీ చదవండి: