పేదలందరికీ ఇళ్ల స్థలాలతో పాటు పక్కా ఇళ్లు నిర్మించి అందించడానికి సర్కారు రంగం సిద్ధం చేస్తుంది. ఇళ్ల స్థలాల పంపణీకి సంబంధించి న్యాయపరమైన వివాదాలు పరిష్కారం అయిన వెంటనే ఈ కార్యక్రమాన్ని పట్టాలెక్కించాలని భావిస్తోంది. గృహ నిర్మాణ సంస్థ ఇంజినీరింగ్ అధికారులకు నిర్మించబోయే ఇళ్లు ఎలా ఉండాలి..? నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా పాటించాలి. ఇళ్ల నిర్మాణానికి ముందుగానే ఆయా నేలల సారం పరిశీలించి అందుకు తగిన విధంగా పునాదులు నిర్మించేలా తిరుపతి ఐఐటీ ఆచార్యులతో ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నారు.
తీర, కొండ ప్రాంతాల్లో నిర్మించబోయే ఇళ్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ప్రభుత్వం నిర్దేశించిన యూనిట్ విలువలోనే ఇళ్లు మొత్తం పూర్తయ్యేలా ఏ నిర్మాణ సామాగ్రిని ఉపయోగించాలి..వాటిని ఎక్కడ నుంచి ఎలా సమకూర్చుకోవాలనే విషయమై సంబంధిత ఆచార్యులు కూలంకుషంగా వివరిస్తున్నారు.
నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ ఆన్‌లైన్ తరగతులు ఆదివారంతో ముగియనున్నాయని గృహనిర్మాణ సంస్థ పీడీ జయరామాచారి చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 758 మంది ఇంజినీర్లు ఈ ఆన్‌లైన్ శిక్షణ పొందుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విశాఖ జిల్లా నుంచి ముగ్గురు ఈఈలు, 19 మంది డీఈలు, 42 మంది ఏఈలు ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఈ ఆన్‌లైన్ తరగతులతో కొత్త విషయాలను తెలుసుకోవడానికి అవకాశం లభించిందని పీడీ చెబుతున్నారు.
ఇదీ చదవండి 'అధికారంలో ఉన్న పెద్దల భవిష్యత్తు త్వరలో తేలనుంది'