CID Case on Posani Krishna Murali : సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 9న తెలుగు యువత రాష్ట్ర ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. పోసానిపై 111, 196, 353, 299, 336(3)(4), 341, 61 (2) బీఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం సీఐడీ కేసు నమోదు చేసింది.
సెప్టెంబర్ 28వ తేదీన పోసాని కృష్ణమురళి సీఎం చంద్రబాబును కించపరిచేలా ఉద్దేశపూర్వకంగా ప్రసార మాధ్యమాల్లో మాట్లాడారని ఆయన ఫిర్యాదులో తెలిపారు. వర్గాల మధ్య విభేదాలు సృష్టించేలా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారని పత్రికా సమావేశంలో పోసాని ఆరోపించినట్లు వంశీకృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం వ్యక్తిత్వాన్ని కించపరిచేలా దూషించారని సీఐడీకి ఫిర్యాదు చేశారు.
సీఎం హిందుత్వ వ్యతిరేకిలా చిత్రీకరించేలా పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారని ఫిర్యాదులో తెలిపారు. మీడియా సమావేశం కొన్ని ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారమయ్యేలా ముందస్తు ప్రణాళిక ప్రకారమే పోసాని వ్యవహరించారన్నారు. పోసాని వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీశాయని వంశీకృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు.
చంద్రబాబు ఫొటో మార్ఫింగ్ చేసి అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదులో చేశారు. పత్రికా సమావేశంలో పెన్ డ్రైవ్ ద్వారా పోసాని కృష్ణ మురళీ మార్ఫింగ్ చేసిన ఫొటోలను చూపారని, వాస్తవ చిత్రాలను జత చేస్తున్నామని వంశీకృష్ణ తెలిపారు. పోసానిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆర్జీవీకి హైకోర్టులో చుక్కెదురు - అరెస్టుపై ఆందోళన
Cases on Posani Krishna Murali: ఇప్పటికే పోసాని కృష్ణమురళిపై పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ టీడీపీ నాయకులు కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. టీటీడీ ఛైర్మన్‌ను అభ్యంతకర పదజాలంతో దూషించిన పోసానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా కర్నూలు మూడవ పట్టణ పోలీసు స్టేషన్లోనూ పోసాని కృష్ణమురళిపై టీడీపీ నాయకులు ఇప్పటికే ఫిర్యాదు చేశారు.
ఇవే కాకుండా శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ పార్టీ టీడీపీ అధ్యక్షుడు కలమట వెంకటరమణమూర్తి సైతం పోసానిపై ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో నారా లోకేశ్, టీడీపీ నాయకులపై దుర్భాషలాడిన నేపథ్యంలో పోసానిపై పాతపట్నంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మాజీ మంత్రి కొడాలి నానిపై విద్యార్థిని ఫిర్యాదు - విశాఖలో కేసు నమోదు