ఆగస్టు నుంచి డిసెంబరు వరకు విశాఖ ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో తరచూ దొంగతనాల కేసులు నమోదయ్యాయి. కానీ.. కారణం ఎవరు అన్నది మాత్రం తెలియలేదు. దీంతో.. ఆయా ప్రాంతాల్లో రాత్రి సమయంలో నిఘా పెంచారు పోలీసులు. ఈ సమయంలోనే.. మధురవాడకు చెందిన మరడ సాయి శుక్రవారం రాత్రి అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని పోలీసులు గమనించి, అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. 11 దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు.
శిక్ష అనుభవించినా మారని తీరు..
నిందితుడు మరడ సాయి గతంలో పెద వాల్తేరులో నివాసముండేవాడు. అతనిపై ఎంవీపీకాలనీ స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ నమోదైంది. పోలీసులు నిఘా పెంచటంతో మధురవాడ దరి కొమ్మాదికి మకాం మార్చాడు. ఇతనిపై ఎంవీపీ, గోపాలపట్నం, ఎయిర్‌పోర్ట్ పోలీస్‌స్టేషన్‌లలో రెండేసి చొప్పున, మూడో పట్టణ పరిధిలో ఒక కేసు నమోదయ్యాయి. పలు ఘటనల్లో జైలు శిక్ష అనుభవించాడు. అయినా మళ్లీ ప్రారంభించాడు.
మరడ సాయి.. పగలు పెయింటింగ్ వృత్తి చేసుకుంటూ.. రెక్కీ నిర్వహిస్తాడు. తాళం వేసిన ఇళ్లను గమనించి స్పాట్ ఫిక్స్ చేసుకుంటాడు. రాత్రి సమయంలో వచ్చి పక్కాగా చోరీకి పాల్పడతాడు అని పోలీసులు తెలిపారు.
ఇలా ఆగస్టు నుంచి డిసెంబరు వరకు 11 ఇళ్లలో రూ.లక్ష నగదు, 25 తులాల బంగారం, 60 తులాల వెండి ఆభరణాలను చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి 23 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
ఇవీచదవండి :