మరణ ధ్రువీకరణ, ప్రమాణ పత్రాలను సృష్టించడంతోపాటు సంతకాలను ఫోర్జరీ చేసి ఓ దంపతులకు చెందిన 300 గజాల స్థలాన్ని అక్రమార్కులు కబ్జా చేశారు. బాధితులు, అధికారులు వెల్లడించిన వివరాలివి. విశాఖలోని కంచరపాలెంకు చెందిన దంపతులు కె.అప్పారావు, సుశీల నరవ గ్రామంలో సర్వేనంబరు 248లోని 300 గజాల స్థలాన్ని 1984లో కొనుక్కున్నారు. ఆ స్థలం ఖాళీగా ఉంది. అప్పారావు కుటుంబీకులు ఆ ప్రాంతానికి దూరంగా నివసిస్తున్నారు. ఇదే అదనుగా విశాలాక్షినగర్‌కు చెందిన సోదరులు జి.తిరుపతిరావు, వెంకటరమణయ్య కుట్ర పన్నారు.
నకిలీ పత్రాలు..ఫోర్జరీ సంతకాలు
అప్పారావు, సుశీలతో వారికెలాంటి సంబంధం లేనప్పటికీ సుశీల సోదరి అవుతుందంటూ రిజిష్టర్ కాని వీలునామాను సృష్టించారు. డాక్యుమెంటు రిజిస్ట్రేషన్ కోసం ప్రస్తుతం బతికున్న అప్పారావు 1998 జులై15న, సుశీల 2001 మే2న మరణించినట్లు అప్పటి తేదీలతో శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయంనుంచి ధ్రువీకరణ పత్రాలను పొందినట్లు చూపారు. రిజిస్ట్రేషన్ సమయంలో సబ్‌రిజిస్ట్రార్‌కు ఒరిజినల్ డాక్యుమెంట్లను చూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం తమ ఒరిజనల్ డాక్యుమెంటు పోయిందంటూ ఓ పత్రికలో ప్రకటన ఇచ్చి కోర్టు నుంచి అఫిడవిట్ తీసుకున్నారు. ఫోర్జరీ సంతకాలు, అవసరమైన నకిలీ పత్రాలతో నమ్మించి ఈ ఏడాది జనవరిలో పెదగంట్యాడ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు.
తక్కువకు విక్రయిస్తున్నందున..
నరవ పరిసరాల్లో గజం విలువ దాదాపు రూ.10 వేలుంటుంది. మోసానికి పాల్పడినవారు రూ.5వేలకు విక్రయించేందుకు స్థానికులను సంప్రదించారు. అప్పారావు దంపతులకు విషయం తెలిసి 2వారాల కిందట పోలీస్ కమిషనర్‌ను సంప్రదించారు. కేసును ఆయన పెందుర్తి పోలీసులకు అప్పగించారు. తప్పుడు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని గురువారం గాజువాక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎస్‌ఆర్‌వో చక్రపాణికి బాధితులు ఫిర్యాదు చేశారు. వారి నుంచి అన్ని ఆధారాలు స్వీకరించామని ఎస్‌ఆర్‌వో చక్రపాణి తెలిపారు. ఆధారాలను డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్‌కు పంపామని అన్నారు.
ఇదీ చదవండి: