TDP leaders: అమరావతి రైతుల యాత్రకు స్వాగతం పలికి.. వైకాపా మినహా అన్ని పార్టీలు వారివెంట నడిచి యాత్రను విజయవంతం చేస్తామని తెదేపా నాయకులు బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. ఉత్తరాంధ్రలో మంత్రులు, ఎమ్మెల్యేలు పిట్టల దొరల్లా తయారయ్యారని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో మూడేళ్లలో ఒక్క ప్రాజెక్టు తేలేదని, ఒక్క అభివృద్ధి పని చేయలేదని విమర్శించారు. వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దృష్టి మళ్లించానికే రాజీనామా డ్రామాలు, రౌండ్ టేబుల్ మీటింగులు పెట్టారని అన్నారు. విశాఖ రాజధాని కోసం ఇంతమంది రాజీనామా డ్రామా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. చివరికి తణుకులో ఉన్న ఓ మంత్రి కూడా రాజీనామా చేస్తానంటున్నారని చెప్పారు.
విజయ సాయిరెడ్డి, ఇతర వైకాపా పెద్దలు ఇక్కడ జరిపిన భూదందాలు పత్రికలో సైతం వచ్చాయని... అవి వాస్తవం కాదా అని ప్రశ్నించారు. విశాఖలో విజయసాయిరెడ్డి అనుచరులు నలుగురు ఈ భూములు వ్యవహారాలు నడుపుతున్నారని ఆరోపించారు. మొత్తం విశాఖ భూముల కుంభకోణాలు వెనుక సీఎం జగన్, విజయసాయిరెడ్డి ఉన్నారని దుయ్యబట్టారు. ఈనెల 15న విశాఖలో వికేంద్రీకరణ కోసం జరిగే ర్యాలీ కేవలం ఈ వైకాపా నాయకులు చేసే రాజకీయ ర్యాలీగా బండారు అభివర్ణించారు.
అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అన్నారు. విశాఖను చంద్రబాబు ఎప్పుడో ఆర్థిక రాజధానిగా ప్రకటించారని గుర్తు చేశారు. ఆనాడు అసెంబ్లీలో ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు... అమరావతే రాజధాని అన్నారని గుర్తు చేశారు. వైకాపా నేతలు ఇప్పుడు మడమ తిప్పి, మాట తప్పారని విమర్శించారు. ఎవ్వరు ఎన్ని చెప్పినా ఈ రాష్ట్రానికే అమరావతి రాజధానిగా నిలుస్తోందని చెప్పుకొచ్చారు
మూడు రాజధానుల బిల్లును జగన్ వెనక్కి తీసుకున్నప్పుడే మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఉండాలని... కానీ రాజధానుల పేరుతో భూదోపిడీలను రక్షించుకోడానికే పన్నాగం వేశారని రాష్ట్ర తెదేపా కార్యదర్శి నొడగల కృష్ణ అన్నారు. ధర్మాన రెవెన్యూ మంత్రిగా ఉన్న సమయంలో ఉత్తరాంధ్రలో భూదోపిడీలు జరిగాయని విమర్శించారు. దసపల్లా భూములను కాజేయడానికే ధర్మానను మళ్లీ రెవెన్యూ మంత్రిని చేశారని కృష్ణ ఆరోపించారు. చంద్రబాబు తెచ్చిన 455 జీవోను వక్రీకరించి భూదందా చేశారని అన్నారు. ఉత్తరాంధ్రలో భూ దోపిడీకి సహకరిస్తున్న బొత్స, ధర్మాన, అమర్లను ఉత్తరాంధ్ర ద్రోహులుగా అభివర్ణించారు.
విశాఖపట్నంలో భారీగా భూములు కొన్న అవ్యాన్ రియల్టర్స్ విజయసాయి రెడ్డి అల్లుడు, కూతురివని.. తనకు మూడు పడకల బెడ్రూం ఇల్లు తప్ప ప్రత్యక్షంగా, పరోక్షంగా విశాఖలో ఆస్తులు లేవన్న విజయసాయి రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సవాల్ విసిరారు. అమరావతి రైతుల పాదయాత్ర 28 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుందని.. ఇది సహించలేకే 151 మంది ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యేతో రాజీనామా డ్రామాలు తెరలేపారని విమర్శించారు.
ఇవీ చదవండి: