జగన్‌కు తెలిసే వైఎస్.వివేకా హత్య జరిగిందనే విషయం సీబీఐ విచారణతో నిర్ధరణ అవుతోందని.. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. స్వయానా వివేకా కుమార్తె సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో హత్య చేయించిందెవరో చెప్పారని గుర్తుచేశారు. హత్యకేసులో సూత్రధారులు రోడ్లపై దర్జాగా తిరుగుతుంటే.. ప్రజల కోసం పోరాడుతున్న తెలుగుదేశం నాయకులపై జగన్ సర్కార్ అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు.
వైకాపా అధికారంలోకి వచ్చాక పరిశ్రమలన్నీ రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయని చెప్పారు. ప్రభుత్వ వేధింపులే అందుకు కారణమన్నారు. ఒక్క పరిశ్రమను తీసుకురాకపోతే.. యువతకు ఉపాధి ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేకహోదా సంజీవని అంటూ ఊదరగొట్టిన జగన్... ఇప్పుడు ప్రధాని కాళ్లపై పడటం తప్ప చేస్తున్నదేమీ లేదన్నారు.
విశాఖ కోర్టుకు..
Lokesh attend Visakha court : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ విశాఖ జిల్లా కోర్టుకు హాజరయ్యారు. సాక్షి దినపత్రికపై గతంలో విశాఖపట్నం 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో భాగంగా ఈనెల 24న విశాఖకు వచ్చారు. కోర్టు వాయిదా అనంతరం కోర్టు బయట మీడియాతో లోకేశ్ మాట్లాడారు.
ప్రజలు భయంతో బ్రతకాలనేదే జగన్ లక్ష్యం
6/2020 నెంబరుతో దాఖలైన వ్యాజ్యంలో తన వ్యక్తిగత పరువుకు భంగం కలిగించేలా దురుద్దేశంతో సాక్షి పత్రికలో తప్పుడు కథనం ప్రచురించారని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి అనుకూల పత్రిక నాపైన, మానాన్నపైన తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి సొంత కుటుంబ సభ్యుల సహాయంతోనే వివేకానంద రెడ్డిని హత్యచేశారని ఆరోపించారు.
చినబాబు చిరుతిళ్లు అనే శీర్షీకతో సాక్షి, డెక్కన్ క్రానికల్ లో వార్త రాశారని.. సాక్షిపై రూ.75 కోట్లు, డెక్కన్ క్రానికల్ రూ.25 కోట్ల పరువు నష్టం దావా వేశానని ఆయన తెలిపారు. ఈనెల 28న, వారికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. తనను రాజకీయాల్లో ఎదగకూడదని పదేపదే తప్పుడు వార్తలు రాస్తున్నారని, తనకు జరిగిన అన్యాయం మరి ఎవ్వరికీ జరగకుండా ఉండేలా న్యాయ పోరాటం చేస్తానని అన్నారు.
ఆంధ్రరాష్ట్రంలో ప్రజలు భయంతో బతకాలనేది జగన్ లక్ష్యమని, అన్నింటిపైనా జగన్ దాడి చేస్తున్నారని.. ఇప్పుడు సినిమా పరిశ్రమపై జగన్ దాడి మొదలుపెట్టారని అన్నారు. వైకాపా మంత్రి స్వయంగా పోలీసులపై అసభ్యంగా మాట్లాడితే నో పోలీస్. వైకాపా మంత్రులు బూతులు మాట్లాడితే నో పోలీస్ అంటూ అసహనం వ్యక్తం చేశారు.
శాసన సభ సాక్షిగా మా అమ్మ క్యారెక్టర్‌ను దూషించారని, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వారి కుమార్తె గురించి నేను కూడా మాట్లాడవచ్చు. కాని మాకు సంస్కారం అడ్డువస్తుందని అన్నారు. శాసనసభలో మా అమ్మని అవమానించారు..2024 తర్వాత వారందరూ క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టను.. మా తల్లికి నేను శపథం చేస్తున్నానని అన్నారు. విశాఖలో మున్సిపల్ స్టేడియం ఆస్తులు కూడా తాకట్టు పెడుతున్నారు. రాజధాని కోసం ఒక్క ఇటుకైనా వేశారా.. అని ప్రశ్నించారు. ప్రజల్ని మభ్యపెట్టడానికి కొత్త జిల్లాల ప్రతిపాదన తీసుకువచ్చారని అన్నారు. అనంతరం విశాఖపట్నం నుంచి నర్సీపట్నంకు నారా లోకేశ్ బయలుదేరి వెళ్లారు.
ఇదీ చదవండి: Students Return: బుకారెస్ట్ నుంచి దిల్లీ చేరుకున్న ఐదో విమానం... ఐదుగురు ఏపీ విద్యార్థులు