ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూనే ఉంటామని మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత చూసి తట్టుకోలేకే..చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించారని ఆయన విమర్శించారు. ఇష్టానుసారం అప్పులు చేసి ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజల్లో వ్యతిరేకత చూసి వైకాపా భయపడుతోంది. సీఎం జగన్‌కు గురించి నేనేమీ తప్పుగా మాట్లాడలేదు. రాష్ట్రంలో కొనసాగుతున్న అసమర్థపాలనను ఎత్తి చూపాను. అంతే కానీ బూతులు తిట్టలేదు. -అయ్యన్న, మాజీ మంత్రి
వివాదం ఏంటంటే..
జగన్ సహా మంత్రులపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్ శుక్రవారం ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిముట్టిడికి యత్నంచారు. వారిని బుద్దా వెంకన్న సహా.. ఇతర తెదేపా నాయకులు ప్రతిఘటించే ప్రయత్నం చేయటంతో చంద్రబాబు నివాసం వద్ద యుద్ధ వాతావారణం నెలకొంది. ఇరు పార్టీల నాయకులు పరస్పర నినాదాలు, దూషణలతో చంద్రబాబు నివాసం రణ రంగాన్ని తలపించింది. ఇరువర్గాల మోహరింపుతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు బారికేడ్లు పెట్టి ఇరు పార్టీల కార్యకర్తలను నిలువరించే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాలూ ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీలు ఝళిపించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగి రమేశ్, బుద్ధా వెంకన్న మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చంద్రబాబు ఇంటి దగ్గర నిరసన ఎందుకు చేపడుతున్నారంటూ బుద్ధా వారని నిలదీశారు. అదే సమయంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో బుద్ధా వెంకన్న స్వల్ప అస్వస్థతకు గురై.. సొమ్మసిల్లి పడిపోయారు. తెదేపా నాయకుల ప్రతిఘటనతో జోగి రమేశ్.. కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలూ రాళ్లు రువ్వుకున్నాయి. ఎమ్మెల్యే జోగి రమేశ్ కారు రాళ్ల దాడిలో ధ్వంసం అయ్యింది. గొడవ మరింత పెరిగేలా ఉందని భావించిన పోలీసులు.. ఇరువర్గాల వారిని చెదరగొట్టి జోగి రమేశ్‌ను అరెస్టు చేశారు. అనంతరం తెదేపా ,వైకాపా నేతలు పరస్పరం డీజీపీకి ఫిర్యాదు చేసుకున్నారు.
సంబంధిత కథనాలు
- CBN HOME: అయ్యన్న వ్యాఖ్యలపై వైకాపా ఆందోళన..చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత
- YCP COMPLAINT: చంద్రబాబు వల్లే అల్లర్లు.. డీజీపీకి వైకాపా నేతల ఫిర్యాదు
- CC FOOTAGE: చంద్రబాబు నివాసానికి భారీగా జోగి రమేశ్ అనుచరులు..సీసీ టీవీ దృశ్యాలు
- తెదేపా అధినేత ఇంటిపై దాడి యత్నం... కర్రలు, రాళ్లతో టీడీపీ, వైసీపీ నేతల పరస్పర దాడులు