యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో నేవల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 6న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యేవారి కోసం.. ప్రత్యేక రైలును తూర్పు కోస్తా రైల్వే నడపనుంది. వాల్తేర్ డివిజన్ ఆధ్వర్యంలో ఇచ్ఛాపురం నుంచి విజయనగరం మీదుగా విశాఖ చేరుకునేలా రైలును ఏర్పాటు చేసినట్లు సీనియర్ డీసీఎం త్రిపాఠి తెలిపారు. ఈ రైలు రేపు సాయంత్రం 5 గంటలకు ఇచ్చాపురంలో ప్రారంభమై 5.40 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుందని, విజయనగరం 7.30 గంటలకు వచ్చి రాత్రి 9 గంటలకు విశాఖ చేరుకునేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు.
మూడు జిల్లాలకు చెందిన 4,500మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక రైలును నడుపుతున్నామని వివరించారు. ఈ రైలుకు రిజర్వేషన్ అవసరం లేదని సాధారణ టిక్కెట్టు తీసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ఈ పరీక్షకు విశాఖలో 22 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఇక్కడ పరీక్ష రాయనున్నారు. కొవిడ్-19 నిబంధనల నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమయింది. భౌతికదూరం పాటించడం, మాస్కుల వినియోగం వంటి అంశాల్లో నిబంధనలు కచ్చితంగా పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రెండు సార్లు పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఆయా కేంద్రాల బాధ్యులతో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి సమీక్షించారు.