ప్రశ్న: విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదానికి ప్రధాన కారణాలు ఏమని భావిస్తున్నారు...?
ఐఐపీఈ సంచాలకులు:
ఎల్ జీ పాలిమర్స్... స్టైరిన్ నుంచి పాలీ స్టైరిన్ తయారు చేస్తోంది. స్టైరిన్ అనేది ఓ మోనోమర్. ఇలాంటి పలు మోనోమర్లు కలిసి పాలిమర్ అవుతుంది. లాక్ డౌన్ కారణంగా దాదాపు 40 రోజులుగా పరిశ్రమ మూతపడి ఉంది. ఇప్పుడు సడలింపులు ఇవ్వడంతో తిరిగి పనులు ప్రారంభించేందుకు సన్నద్ధమయ్యారు. స్టైరిన్ స్టోరేజ్ ట్యాంక్ లో ఉన్నప్పుడు...దాని నుంచి పాలిమర్ తయారీకోసం తీసుకుంటున్నప్పుడు ఉష్ణమోచక చర్యలు జరుగుతాయి. అధిక మొత్తంలో విడుదలయ్యే ఉష్ణం కారణంగా.....ఒత్తిడి ఎక్కువై సేఫ్టీ వాల్ ను పగులగొట్టుకుని ఆ వాయువులు బయటకి వచ్చేస్తాయి. సాధారణ పరిస్థితుల్లో తనిఖీల్లో ఇవి బయటపడతాయి. అలాంటప్పుడు కండెన్సర్ లను వాడి శీతలీకరణ కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కానీ లాక్ డౌన్ కారణంగా.. .చెక్ అప్ లు లేకపోవటం వలన.....ఈ పరామితులను పరీశిలించే ప్రక్రియ జరగకపోవటంతో....ఈ ప్రమాదం జరిగి ఉండి ఉండవచ్చు. ముందుగా ట్రైల్ రన్ చేసి ఉంటే....దీని గుర్తించగలిగేవాళ్లు.
ప్రశ్న: గ్యాస్ లీకయ్యే క్రమంలో వెంటనే గుర్తిస్తే... ప్రమాదం తగ్గేది అంటున్నారు. ఈ విషయంలో సంస్థ నిర్లక్ష్యం ఉందని భావించవచ్చా..?
ఐఐపీఈ సంచాలకులు:
పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిగిన తర్వాతే ఇది స్పష్టమవుతుంది. లాక్ డౌన్ తర్వాత.....తిరిగి పరిశ్రమను ప్రారంభించేటప్పుడు కచ్చితంగా సేఫ్టీ పరంగా ప్రమాణాలను అవలంబించాల్సి ఉంటుంది. ఓ రకంగా ఆలోచిస్తే గ్యాస్ లీకై ఉండకపోతే ఒత్తిడి పెరిగిపోయి స్టోరేజ్ ట్యాంక్ పేలి ఉంటే ఈ ప్రమాదం మరింత దారుణంగా ఉండేదేమో..! ఆ పరంగా ఆలోచిస్తే కొంచెం ప్రమాదంలో సానుకూల అంశాలు కనిపిస్తున్నాయి.
ప్రశ్న:అసలు ఈ రసాయనానికి మండే స్వభావం ఉందా.....మండే స్వభావం ఉంటే ప్రమాదం మరింత ఎక్కువగా ఉండే అవకాశాలుండేవా?
ఐఐపీఈ సంచాలకులు:
స్టైరిన్ C8H8 ఓ హైడ్రో కార్బనే. కనుక ఒత్తిడి ఇంకా ఎక్కువ అయ్యే ఉంటే ప్రమాదం మరింత ఎక్కువగానే ఉండేది. స్టైరిన్ గాలిలో ఉండే ఆక్సిజన్ ను పీల్చుకుంటుంది. అందుకే ప్రమాదం జరిగిన పరిసర ప్రాంతాల్లో చెట్ల ఆకులన్నీ నల్లగా కనిపించాయి. నిద్ర పోతున్న సమయం కావటంతో అక్కడి ప్రజలంతా అపస్మారక పరిస్థితిలోకి వెళ్లిపోయారు. అపస్మారకంగా విషవాయువును ఎక్కువుగా పీల్చడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది. మెదడు, .ఊపిరితిత్తులు, గొంతు, జీర్ణాశయం పై దీని ప్రభావం ఉంటుంది.
ప్రశ్న: ఈ తరహా ప్రమాదకర రసాయన పరిశ్రమలు....జనావాసాల్లో ఉండటం సరైనదే అంటారా...?
ఐఐపీఈ సంచాలకులు:
ఈ పరిశ్రమను హిందుస్థాన్ పాలిమర్స్ సంస్థ ప్రారంభించినప్పుడు జనవాసాలకు దూరంలోనే ఉంది. కాలక్రమేణా అందులో ఉద్యోగాలు చేసేవాళ్లు... దానిపై ఆధారపడి జీవించే వాళ్ల కారణంగా చుట్టూ....జనావాసాలు ఏర్పడ్డాయి. ఇప్పటికిప్పుడూ ఈ పరిశ్రమను జనావాసాలకు దూరంగా తరలించినా భవిష్యత్ లో అక్కడా జనావాసాలు వచ్చే అవకాశం లేకుండా చూడాల్సిన ఆవశ్యకత ఉంది.
ప్రశ్న: స్టైరిన్ ప్రజల ప్రాణాలపై ప్రభావం చూపించేంత స్థాయిలో ఉండటానికి కారణాలేంటి?
ఐఐపీఈ సంచాలకులు:
స్టైరిన్కు సాంద్రత ఎక్కువ. మిగిలిన వాయివులు గాలిలో కొట్టుకుపోయే అవకాశం ఉన్నా....స్టైరిన్ కి ఉండే ఎక్కువ సాంద్రత కారణంగా చాలా సేపు గాలిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా అక్కడ నివసించే ప్రజలు ఎక్కువ సమయం ఈ రసాయన ప్రభావానికి లోనవుతారు. ఇది ఓరకంగా ప్రమాదం లాంటిదే. దీని ప్రభావానికి లోనైన వారికి ఇతర ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశమూ ఉంది. ఒకటి రెండు రోజుల వరకూ దీని ప్రభావం ఉంటుంది.
ప్రశ్న: ఈ రసాయన ప్రభావానికి లోనైన వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
ఐఐపీఈ సంచాలకులు:
దీనికి సమాధానం చెప్పటం కొంచెం క్లిష్టమైనది. ఈ రసాయన ప్రభావానికి లోనైన వారిలో అది ఎలాంటి చర్యలను చూపెడుతోంది...ఎంత తీవ్రత ఉంది అన్న అంశాలను పరిశీలించిన తర్వాతే వారిపై భవిష్యత్ లో ఉండే దీని ప్రభావం చెప్పవచ్చు. వాయవు పీల్చటం తీవ్రతరమై...అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన వారికి శ్వాససంబంధిత, జీర్ణకోశ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. వారు కోలుకున్న తర్వాతా...వారిపై రసాయన ప్రభావం కొన్నాళ్ల పాటు కొనసాగవచ్చు. భవిష్యత్ లో రసాయన ప్రభావాలుండే చోటికి వారు వెళ్లకపోవటం ఉత్తమం.
ప్రశ్న: రసాయన ప్రభావానికి లోనైన వారిలో పసిపిల్లలు ఉన్నారు వారి పరిస్థితి ఏంటి?
ఐఐపీఈ సంచాలకులు:
చిన్నపిల్లల్లో ఈ రసాయనాల ప్రభావాన్ని తట్టుకునే శక్తి చాలా తక్కువ ఉంటుంది. ఇలాంటి సంఘటనలు వారి పాలిట చాలా దురదృష్టకరం. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన, సంబంధిత అధికారులపైన కచ్చితంగా ఉంది.
ప్రశ్న: ఈ తరహా ప్రమాదాలు జరిగే చోట...జనవాసాప్రాంతాలుంటే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలి?
ఐఐపీఈ సంచాలకులు:
ప్రమాదాలు జరుగుతున్నాయనే కారణంతో...పరిశ్రమలను వెంటనే తరలించలేము. ఆ పరిశ్రమపై జీవిస్తున్న ఉద్యోగులు వారి కుటుంబాలు చాలా ఉన్నాయి. వారందరినీ దృష్టిలో పెట్టుకుని...ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేలా....పరిశ్రమకు సంబంధించిన యూనిట్ లలో ప్రతీ విభాగాన్ని క్షుణ్నంగా తనిఖీలు చేయాలి. ఈ ప్రమాదం జరిగిన తీరుపై నివేదిక తయారు చేయాలి. ఇందుకోసం నిపుణుల పర్యవేక్షణ తప్పనిసరి. ఘటనకు బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో...భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా స్పష్టమైన కార్యచరణ ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం అంతే ఉంది.
ప్రశ్న: ప్రత్యేకించి రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఐఐపీఈ సంచాలకులు:
కెమికల్ స్టోరేజ్ సంబంధించిన నివేదికలు తప్పనిసరిగా తయారు చేయాలి. ర్యాండమ్ పద్ధతిలో రసాయన పరిశ్రమల్లో అధికారులు తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ తరహా తనిఖీల్లో కనిపిస్తున్న అలసత్వమే పెనుప్రమాదాలకు కారణమవుతోంది.
ప్రశ్న: గతంలో విశాఖలోనే హెచ్ పీ సీఎల్, స్టీల్ ప్లాంట్ యూనిట్ లలో జరిగిన ప్రమాదాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగినప్పుడు హడావిడి తప్ప.. తర్వాత భద్రతను విస్మరిస్తున్నారు...? దీనికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి.
ఐఐపీఈ సంచాలకులు:
ప్రమాదాలు జరిగేవి.. ప్రమాదాలకు తక్కువ అవకాశం ఉన్నవి అనే విభాగాలుగాపరిశ్రమలను విభజించాలి. ప్రమాదాలు తక్కువుగా ఉండే పరిశ్రమలకు ఇప్పుడున్న వ్యవస్థ పర్యవేక్షణ సరిపోతుంది. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న పరిశ్రమలకు మాత్రం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అందులో ఒక తనిఖీల విభాగాన్ని ప్రత్యేకంగా నిపుణుల బృందంతో ఏర్పాటు చేసుకోవాలి. వారు తరచుగా పరిశ్రమలను తనిఖీలు చేస్తూ...ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారమున్న ప్రాంతాలను గుర్తించి..యాజమాన్యాలను అప్రమత్తం చేయాలి.
ప్రశ్న:లో స్టీల్ ప్లాంట్, హెచ్ పీసీఎల్ ప్రమాదాల్లో కమిటీలను ఏర్పాటు చేసినా.....ప్రమాదాలు జరుగుతూనే ఉండటానికి కారణాలను ఎలా విశ్లేషిస్తారు?
ఐఐపీఈ సంచాలకులు:
పూర్తిస్థాయి లో ప్రమాదాల నివారణకు కట్టుబడి అంతా పనిచేయాల్సిన అవసరం ఉంది. రెండు, మూడు నెలలకోసారి ఉద్యోగుల కు ఈ ప్రమాదాలు జరిగే ఆస్కారాలపై శిక్షణ మాక్ డ్రిల్ రూపంలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉద్యోగుల మానసిక పరిస్థితులపైనా దృష్టి సారించి ...వారి విధుల్లో పూర్తిగా నిమగ్నమయ్యేలా ఆసక్తి కల్పించాలి. ప్రతీ పరిశ్రమలోనూ ఉద్యోగుల కోసం సైకాలజిస్ట్ తో ప్రత్యేక తరగతులను నిర్వహించి అంకిత భావాన్ని పెంపొందించటం అవసరం. తద్వారా ఈ తరహా ప్రమాదాలను నివారించటంతో పాటు.....చేసే పనిని అత్యంత శ్రద్ధగా చేసే ఆస్కారం ఉంటుంది. భవిష్యత్ లోనూ ఇలాంటి ప్రమాదాలను నివారించి ప్రాణాలను పరిరక్షించుకునే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి