ఉత్తరాంధ్రవాసుల ప్రత్యక్ష దైవం సింహాచల లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ దేవస్థానం కట్టుదిట్ట చర్యలు చేపట్టింది. కొండపై దేవాలయ గోపురానికి 500 మీటర్లు దూరం నుంచి.. క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ముందుగా భక్తుల చేతులను శానిటేషన్ చేశాక లోపలికి అనుమతిస్తారు. మాస్కులు ధరించడాన్ని కచ్చితంగా అమలుచేస్తామని అధికారులు తెలిపారు. ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. భక్తులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.
గంటకు 50 నుంచి 300 మంది దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆన్లైన్లో ఆర్జిత సేవల టికెట్లు జారీ చేస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు కరోనా నివారణ జాగ్రత్తలు తీసుకుంటూ.. సూచనలు పాటించాలని దేవస్థానం అధికారులు కోరుతున్నారు.
ఆలయంలో కేవలం లఘు దర్శనాన్నే అమలు చేస్తున్నారు. తాత్కాలికంగా గర్భాలయ దర్శనాలు రద్దు చేశారు. పదేళ్ల లోపు చిన్నారులు, 65 ఏళ్ల వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వారిని దర్శనానికి అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. భక్తులు క్యూలైన్లో ఇనుప వస్తువులు తాకకుండా ఉండాలని సూచిస్తున్నారు. సిబ్బంది, గ్రామస్థుల దర్శనాల్లో వచ్చిన లోటుపాట్లను చూసి భక్తులు దర్శనాల సమయానికి పటిష్ఠ ఏర్పాట్లుచేస్తామని దేవస్థానం పాలక వర్గం తెలిపింది.
సింహాచలం కొండ కింద తొలిమెట్టు దగ్గర కూడా భక్తుల దర్శన ఏర్పాట్ల విషయంలో అధికారులు కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకున్నారు. దేవస్థానం బస్సులో భక్తులను తీసుకెళ్లే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి..