వైకాపా ప్రభుత్వం వచ్చాక విశాఖలో ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అని సబ్బం హరి ప్రశ్నించారు. వెళ్లిపోయిన పరిశ్రమల జాబితా తమ వద్ద ఉందన్నారు. ఉద్యమం చూసి పోస్కో ప్రతినిధులు రావడానికి ఆలోచిస్తున్నారన్నారు. ఒడిశాలో పరిశ్రమను ముట్టుకోలేదని.. అక్కడి సీఎం ఒప్పుకోలేదన్నారు. సీఎం జగన్ ఒప్పుకున్నందునే ప్రైవేటీకరణపై కేంద్రం అడుగులు వేస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం జగన్ ముందుండి ఉద్యమం నడిపించాలని సబ్బం హరి సూచించారు. ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరణ జరగాలంటే సీఎం వల్లే సాధ్యమని స్పష్టం చేశారు.
'ప్రజలకు వాస్తవాలను దాస్తున్నారు.. భాజపా సమాధానం చెప్పాలి. విశాఖ ఉక్కుపై చంద్రబాబు పోరాటం చేయాలి. రూ.15 బియ్యం కోసం రూ.600 కోట్లు పెట్టి వాహనాలు కొంటారా?. రేషన్ బియ్యం వాహనాలు నడిపేవారికి మరో రూ.10 వేలు ఇస్తున్నారు. ప్రభుత్వ అవగాహన రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది.' అని సబ్బం హరి విమర్శించారు.
జగన్, విజయసాయికి అవాస్తవాలు మాట్లాడడం అలవాటైందని సబ్బం హరి విమర్శించారు. ఒప్పందంలో భాగస్వాములైన విషయం అందరికీ తెలుసు అన్నారు. ప్రజలను మభ్యపెట్టాలని చూడడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. జగన్‌తో మాట్లాడాకే ఒప్పందంపై ముందుకెళ్లారని సబ్బం వ్యాఖ్యానించారు. కేసుల నుంచి రక్షించండని బేరాలే సరిపోయాయని ఆరోపించారు. కేసుల నుంచి బయటపడేస్తే దేనికైనా ఒప్పుకొంటారన్నారు.
పోస్కో అధికారులు రావాలంటే ఉద్యమాన్ని అణచివేయాలి. పోస్కో కోసమే ఉద్యమాన్ని ఆపించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులతో ఉద్యమాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంపీలు రాజీనామా చేస్తే పార్టీలకతీతంగా ముందుకొస్తారు. ప్రజలను ఎంతవరకు మభ్యపెట్టాలని చూస్తారు?.
-సబ్బం హరి, మాజీ ఎంపీ
ఇదీ చదవండి: ఉక్కు పోరాటం ఉద్రిక్తం.. నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాట