విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో బాధితులకు న్యాయం చేయాలంటూ సీఐటీయూ నాయకులు నిరసన చేశారు. నగర పాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. గ్యాస్ లీకేజీ ప్రమాదం జరిగి ఏడాది గడుస్తున్నా.. పలువురికి పరిహారం అందలేదన్నారు. ఘటనకు సంబంధించి హైపవర్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకుడు గంగారాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారిలో ముగ్గురు బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించలేదని మండిపడ్డారు.
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం ప్రకటించి చేతులు దులుపుకోవటం సిగ్గుచేటని అన్నారు. బాధితుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు కేఆర్ కుమార్ మంగళం, నగర అధ్యక్షుడు ఆర్కెఎస్ రవికుమార్, కార్యదర్శి బి.జగన్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
హైకోర్టు తీర్పు : సంగం డెయిరీని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవో నిలుపుదల