విశాఖ కూర్మన్నపాలెంలో కార్మిక సంఘాల ఆందోళన కొనసాగుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉక్కు నిర్వాసితులు, ఆందోళనకారులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిపాలన కార్యాలయం ముట్టడికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ ఆందోళన జరగనుంది.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 100 శాతం ప్రైవేటీకరిస్తామన్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో... కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. నిన్న రాత్రి 7 నుంచి దిగ్బంధనం, రాస్తారోకో కొనసాగుతోంది. సమయం గడిచేకొద్దీ కూర్మన్నపాలెం గేటు వద్ద మరికొందరు కార్మికులు పోగయ్యారు. వందలకొద్దీ వాహనాలు నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్ పెద్దఎత్తున స్తంభించింది. కేంద్రం నిర్ణయాన్ని అంగీకరించబోమని కార్మిక సంఘాల నేతలు తేల్చిచెప్పారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా త్వరలో కార్యాచరణ నిర్ణయిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి:
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై.. కార్మిక సంఘాల రాస్తారోకో