జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు ప్రాదేశిక స్థానాలకు నామపత్రాల స్వీకరణ బుధవారం ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఉదయం 10.30 గంటలకు మొదలైన ప్రక్రియ రాత్రి 9.20 గంటలకు ముగిసింది. నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకే నామపత్రాలను స్వీకరించాలి. నిర్ణీత గడువు ముగిసే సమయానికి భారీగా అభ్యర్థులు టోకెన్లు తీసుకున్నారు. దీంతో అధికారులు సమయం పొడిగించారు. గడువు ముగిసేలోగా జడ్పీ హాలు లోపలికి వచ్చిన వారందరికీ నిబంధనల ప్రకారం అవకాశం ఇవ్వొచ్ఛు సాయంత్రం 5 గంటలవరకు 120 మంది నామపత్రాలు దాఖలు చేయగా.. రాత్రి 8 గంటల సమయానికి ఆ సంఖ్య 220కి చేరింది. చివరకు రాత్రి 9.20 గంటలకు ముగిసింది.
చివరి రోజు భారీగా...
నామపత్రాల స్వీకరణ మొదలైన తొలిరోజు ముగ్గురు మాత్రమే నామపత్రాలు దాఖలు చేశారు. రెండో రోజు మంగళవారం కేవలం 15 మందే వేశారు. మూడో రోజు మాత్రం 238 మంది 295 సెట్లను జడ్పీ సీఈవో, ఆర్‌వోకు అందజేశారు. దీంతో జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. వీటిని అధికారులు గురువారం పరిశీలిస్తారు. తిరస్కరణకు గురైన నామపత్రాలపై అప్పీలుకు 13వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట వరకు గడువు ఉంది. అప్పీళ్లను కలెక్టరు వద్ద వేయాల్సి ఉంది. ఈ నెల 14న మధ్యాహ్నం 3 గంటలకు అభ్యర్థుల తుది జాబితా వెల్లడవుతుంది. అదే రోజు గుర్తులను కేటాయిస్తారు.
తొలిరోజు స్కోరు 24
జీవీఎంసీ ఎన్నికలకు నామపత్రాల స్వీకరణ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు 15 వార్డుల్లో 23 మంది అభ్యర్థులు తమ నామపత్రాలను ఆయా జోనల్ కార్యాలయాల్లో దాఖలు చేశారు. 7వ వార్డులోని వైకాపా అభ్యర్థి రెండు నామినేషన్ పత్రాల్ని దాఖలు చేయడంతో మొత్తం సంఖ్య 24గా ఉంది. అత్యధికంగా 35, 67వ వార్డుల్లో మూడేసి పడ్డాయి.
- తెదేపా నాయకురాలు వంజంగి కాంతమ్మ రెబల్ అభ్యర్ధిగా పాడేరు జెడ్పీటీసీ స్థానానికి నామపత్రం దాఖలు చేశారు.
- రాత్రి వరకు నామపత్రాలను స్వీకరించడం వల్ల గ్రామీణ, గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. నిర్ణీత ముహూర్తానికి అందజేయలేకపోయామన్న బాధ వారిని వేధించింది. అయితే ముహూర్త బలం ప్రకారం నామపత్రాలపై సంతకాలు చేశామని కొంతమంది సంతృప్తి వ్యక్తంచేశారు.
- మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ తమ్ముడు గండి వంశీదాస్ సబ్బవరం జడ్పీటీసీ స్థానాకి తెదేపా అభ్యర్థిగా నామపత్రం దాఖలు చేశారు.
- అనంతగిరి భాజపా అభ్యర్థి పాంగి అప్పలమ్మ, డుంబ్రిగుడ కాంగ్రెస్ అభ్యర్థి కొర్రా రుక్మిణి అచ్చమైన గిరిజన వస్త్రధారణతో వచ్చారు.
- తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే అనితను జడ్పీ కార్యాలయ ఆవరణ లోపలకు అనుమతించలేదు. దీంతో ఆమె కొంత నిరుత్సాహానికి గురయ్యారు.
ఇదీ చదవండి : పల్నాడులో కర్రలు, కత్తుల స్వైరవిహారం