‘కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసినప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని దేశంలోని ఇతర సంస్థల్లా పరిగణించవద్దని, ప్రజలకు దానితో ముడిపడిన భావోద్వేగాలను వివరించాం. కర్మాగారంలో దాదాపు 18 వేల మంది శాశ్వత ఉద్యోగులు, 20 వేల మంది ఒప్పంద ఉద్యోగులుండగా పరోక్షంగా లక్ష మంది జీవిస్తున్నారని తెలిపాం. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రైవేటీకరణ విషయంలో ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయాలని కోరాం. భాజపా రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ను కలిసినప్పుడు 32 మంది బలిదానాల తర్వాత ఉక్కు కర్మాగారం ఏర్పడిన విధానాన్ని వివరించాం. విశాఖ ఉక్కు ఆంధ్ర ప్రజల మనోభావాలు, ఆత్మగౌరవానికి ప్రతీక అయినందున పెట్టుబడుల ఉపసంహరణ అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించాలని కోరాం. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచించాలని కోరాం’ అని పవన్ చెప్పారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు పోస్కో కంపెనీతో 2019లోనే కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని పార్లమెంటులో ఓ ప్రశ్నకు సమాధానం వచ్చిందని విలేకర్లు ప్రస్తావించగా.. ఒప్పందం జరిగినప్పుడు ముఖ్యమంత్రి జగన్ లేఖ రాయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ వ్యతిరేక ఆందోళనల్లో తమ పార్టీ కార్యకర్తలు పాల్గొంటున్నారని చెప్పారు.
3, 4 తేదీల్లో అమిత్‌షా పర్యటన
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, శాంతిభద్రతల అంశాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు పవన్ తెలిపారు. మార్చి 3, 4 తేదీల్లో అమిత్ షా తిరుపతి వస్తారని, అప్పుడు రాష్ట్రంలో శాంతిభద్రతల విషయాన్ని మరింత లోతుగా ఆయనతో చర్చిస్తామన్నారు. తిరుపతి ఉప ఎన్నిక, వచ్చే ఎన్నికలకు జనసేన- భాజపా మార్గసూచీపై కోర్‌కమిటీలో చర్చించనున్నట్లు వెల్లడించారు. ఎవరికైనా రాజకీయాల్లోకి వచ్చే హక్కు ఉందని, షర్మిల పార్టీ విధివిధానాలు వచ్చాక స్పందిస్తానని పవన్ ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
ప్రజల్ని మభ్యపెట్టేలా సీఎం లేఖ: మనోహర్
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి మురళీధరన్‌ను కలిసినప్పుడు త్రివేండ్రం విమానాశ్రయం ప్రైవేటీకరణ అంశంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే వాళ్లకే కేంద్రం తొలి ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారన్నారు. ప్రస్తుతం మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ప్రపంచానికి తెలుసని, ఉక్కు కర్మాగారాన్ని తాము కొంటామంటూ ముఖ్యమంత్రి ప్రజలను మభ్యపెట్టేలా లేఖ రాశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడాలని నిర్ణయించుకుంటే కేరళ మాదిరే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: పంచాయతీ పోరు: జోరుగా రెండోదశ ఎన్నికల ప్రచారం