Villagers Protest against Sea Food Company : నాగ హనుమాన్ సీ ఫుడ్ కంపెనీని మూసేయాలని విశాఖ జిల్లాలోని పాలవలస గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా నేడు నాలుగోరోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని చెబుతున్నా పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు.
గ్రామంలో ఇప్పటికే సుమారు 40 మంది కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడ్డారని, వారిలో 20 మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో పది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, 8 మంది ఇంటి వద్దనే వైద్యుల సలహాలతో మందులు వాడుతున్నారని గ్రామస్థులు తెలిపారు. ఇన్ని సమస్యలకు కారణమవుతున్న నాగ హనుమాన్ సీ ఫుడ్ కంపెనీని మూసేయాలని డిమాండ్ చేశారు. కంపెనీని మూసే వరకు పోరాడతామని కరాఖండిగా తెలిపారు.
కంపెనీకి రాకపోకలు లేకుండా చుట్టూ ఉన్న రహదారులపై గుంతలు తవ్వారు. ఆందోళన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తహసీల్దార్ వేణుగోపాల్ మధ్యవర్తిత్వంతో కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపినప్పటికీ సఫలం కాలేదు. సమస్య-పరిష్కారం అయ్యేంతవరకు ఆందోళన కొనసాగుతుందని స్థానికులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : YCP Flexi Issue : 'మోసపోయిన వైఎస్సాఆర్సీపీ కార్యకర్తలు'.. ముప్పాళ్లలో ఫ్లెక్సీ కలకలం..