మావోయిస్టులతో సంబంధాల వ్యవహారంలో జాతీయ దర్యాప్తు సంస్థ(National Investigation Agency) తెలుగు రాష్ట్రాల్లో సోదాలు చేస్తూ పలువురు వ్యక్తులను ప్రశ్నిస్తోంది. మావోయిస్టులతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉన్న వారి ఇళ్లల్లో.. 14 ప్రదేశాల్లో ఇవాళ తెల్లవారుజామునుంచి సోదాలు(NIA raids in Telugu states) నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఐఏ కేంద్ర కార్యాలయం ధ్రువీకరించింది. ఇప్పటికే నమోదు చేసిన పలు కేసుల దర్యాప్తులో భాగంగా.. ఈ సోదాలు జరుపుతున్నట్లు వెల్లడించింది.
వారిపైనే ప్రధానంగా దృష్టి...
కేరళ, ఛత్తీస్‌ఘడ్, ఎఓబి, జార్ఖండ్, దుమ్ముగూడెం సహా పలు పేలుళ్ల కేసులపై ఎన్‌ఐఎ దర్యాప్తు చేస్తోంది. పేలుడు పదార్ధాలు సేకరించడం, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్రపన్నడం వంటి వ్యవహారాలతోపాటు.. అమాయక ప్రజలను ఉగ్రవాదంవైపు ఆకర్షించి వారికి శిక్షణ ఇవ్వడం వంటి అంశాలపై కూడా దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఐఎ.. పలు కేసుల విచారణలో భాగంగా.. సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల మరణించిన అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఉదయం నుంచి జరుగుతున్న సోదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయన్న దర్యాప్తు అధికారులు.. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల్లో, తెలంగాణలోని హైదరాబాద్‌లో ఒక ప్రదేశంలో జరుగుతున్నట్లు పేర్కొన్నారు. మరికొన్ని ప్రదేశాల పేర్లు వెల్లడించేందుకు ఎన్‌ఐఎ అధికారులు సుముఖత చూపలేదు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్ఐఏ సోదాలు...
ప్రకాశం జిల్లా ఆలకూరపాడులోని విరసం నేత కల్యాణ్‌రావు ఇంట్లో ఎన్ఐఏ (NIA raids in AP) బృందం సోదాలు చేస్తోంది. మావోయిస్టుల సానుభూతిపరులన్న కారణంతో నెల్లూరులో ఎన్ఐఏ చేపట్టిన సోదాలు పూర్తయ్యాయి. దాదాపు ఆరు గంటల పాటు నగరంలోని అరవింద నగర్ లో ఉన్న అనూష, అన్నపూర్ణల నివాసంలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నివాసంలోనే అణువణువూ క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు, అనూష, అన్నపూర్ణలను ప్రశ్నించారు. వీరిద్దరి సెల్ ఫోన్ లతోపాటూ, టైలరింగ్ కొలతలు రాసుకునే పుస్తకాన్ని అధికారులు తీసుకువెళ్లారు. కోర్టు ఆదేశాలతో తనిఖీలు చేస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు చెప్పారని అనూష, అన్నపూర్ణలు తెలిపారు. తనిఖీలకు గల కారణాలు మాత్రం చెప్పలేదన్నారు. తమ సోదరుడు ఇటీవల నక్సలిజంలో మృతి చెందడం వల్లే ఈ తనిఖీల్లో చేసినట్లు తాము భావిస్తున్నామని వెల్లడించారు. విశాఖలోని ఆరిలోవలో ప్రజా సంఘంలో పని చేస్తున్న అన్నపూర్ణ ఇంటిపై మళ్ళీ జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తోంది. ఇవాళ తెల్లవారు జామున నుంచే తనిఖీలు చేస్తున్నారు.
సోదాల అనంతరం విరసం నేత కల్యాణరావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల పక్షాన మాట్లాడటం నేరమా? అని ప్రశ్నించారు. తమపై ఏ తప్పుడు కేసులు బనాయిస్తారో తెలియదన్నారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కేపై రాసిన ‘‘శాంతియుద్ధం - శాంతిస్వప్నం’’ అనే వ్యాసాల పుస్తకాన్ని ముద్రించకుండా భగ్నం చేయడం దారుణమన్నారు.
తెలంగాణలో ఎన్ఐఏ సోదాలు-ఆర్కే పుస్తక ప్రచురణపై విచారణ
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లోని మాజీ మావోయిస్టుల ఇళ్ల (NIA raids in ex Naxalites house)లో తెల్లవారుజాము 5 గంటల నుంచే సోదాలు చేశారు. నాగోల్‌లోని రవిశర్మ, అనురాధతో పాటు అమరుల బంధు మిత్రుల సంఘం నాయకురాలు భవానీ ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. మావోయిస్టులతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఆర్కే జీవిత చరిత్రపై పుస్తకం (Maoist RK Book) ప్రచురించే విషయంలోనూ వివరాలు తెలుసుకుంటున్నారు.
ఓయూలోనూ సోదాలు...
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారుల సోదాలు(NIA raids in Hyderabad) కొనసాగుతున్నాయి. హిమాయత్ నగర్ వీధి నెంబర్ 14లోని అంబికా టవర్స్ భవనంలోని ఆదిత్య లేడీస్ హాస్టల్లో తెల్లవారు జామున ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏడు గంటల పాటు సోదాలు కొనసాగాయి. ఓయూ విద్యార్థినులు నివాసం ఉంటున్న వసతిగృహాల్లో సోదాలు చేసి(NIA raids in Hostels) మావోయిస్టులతో సంబంధాలపై ఆరా(NIA questions OU students) తీశారు. విద్యార్థినుల ఆధార్, ఐడీ కార్డులను పరిశీలించారు. పలు కళాశాలల్లో డిగ్రీ చదువుతున్న ఐదుగురు విద్యార్థినుల నుంచి పూర్తి వివరాలు సేకరించిన అధికారులు.. వారి వద్ద పలు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు.
సోదాలు సరికాదు -ప్రజా సంఘాలు
ఎన్ఐఏ మళ్లీ రాష్ట్రంలోని 60 మందికి నోటీస్ లు ఇవ్వడంపై భారత కార్మిక సంఘాల సమాఖ్య, భారత రైతుకూలీ సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, అరుణోదయ రాష్ట్ర కమిటీలు విజయవాడలో ఆందోళన చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిరసన సభ నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో హక్కులను కాలరాసేలా ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు వ్యవహరించడం దారుణమన్నారు.రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రానికి లొంగి ప్రజాతంత్ర వాదులపై నిర్బంధ చట్టాలను ప్రయోగించడం సరికాదన్నారు.
కేసు నేపథ్యం..
2019 జులై 28న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా నాగర్నార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్ దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు, ఒక పౌరుడు చనిపోయారు. ఈ కేసు 2021 మార్చి 18న ఎన్.ఐ.ఎ.కి బదిలీ అయింది. సంజు అలియాస్ పండు, లక్ష్మణ్, మున్ని, దశరిలతోపాటు 40 మంది నిందితులని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గురువారం సోదాలు నిర్వహించారు.
ఇదీ చదవండి :
VIVEKA MURDER CASE: కొనసాగుతున్న విచారణ... కడపకు శివశంకర్‌రెడ్డి తరలింపు