విశాఖలో ప్రేమోన్మాది అఖిల్ చేతిలో దారుణహత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని మృతదేహం.. శ్రీనగర్‌లోని ఆమె నివాసానికి చేరుకుంది. విగతజీవిగా ఉన్న యువతిని చూసి తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కడసారి చూపు కోసం స్నేహితులు, బంధువులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
అధికారుల పరామర్శ..
విశాఖ నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, డీసీపీ ఐశ్వర్య రస్తోగి యువతి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కేసులో న్యాయం జరిగేలా చూస్తామని బాధితురాలి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
ప్రేమ పేరుతో కిరాతకానికి పాల్పడిన వాళ్ళను ఉపేక్షించమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. విశాఖ ప్రభుత్వ అతిధి గృహం దగ్గర ఆమె మీడియాతో మాట్లాడారు. నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేందుకు పోలీసు యంత్రాంగం వేగంగా పని చేస్తుందని తెలిపారు. అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ఆడపిల్లలు ఎదిరించి.. కళ్లలో కారం కొట్టైనా ప్రాణాలు నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రతి మహిళకూ ప్రభుత్వం అండగా నిలుస్తుందని.. బాధితురాలి కుటుంబాన్ని ఆదుకుంటుందని వెల్లడించారు. అందరూ 'దిశ' యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: గాజువాక ఘటనపై సీఎం ఆరా... రూ.10 లక్షలు సాయం చేయాలని ఆదేశం