భారీ వర్షాలకు విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాలలో పంట, ఆస్తి నష్టం సంభవించిందని, బాధితులకు పరిహారం అందిస్తామని పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో.. కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, జి.వి.ఎం.సి కమిషనర్, సంబంధిత శాఖల అధికారులతో వరద నష్టంపై మంత్రి శాఖల వారీగా సమీక్షించారు. కాలువలు, చెరువులకు గండ్లు పడడం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యి పంట పొలాలు మునిగిపోయాయని మంత్రి తెలిపారు. వరద నష్టాలకు సంబంధించిన ఎన్యూమరేషన్ను వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. పూర్తి పారదర్శకంగా నివేదికను అందజేయాలన్నారు.
కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 15 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయ్యిందన్నారు. 30 మండలాలలో భారీ వర్షం నమోదైందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఆరుగురు మృతి చెందారన్నారు. వ్యవసాయానికి సంబంధించి సుమారు 5 వేల హెక్టార్లు వరి, 666 హెక్టార్ల చెరకు, పలు వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఉద్యానరంగానికి సంబంధించి 15 మండలాలలో 84 హెక్టార్లలలో నష్టం వాటిల్లిందన్నారు. పశు నష్టాలపై కూడా మదింపు చేస్తున్నట్టు చెప్పారు.
ఇదీ చదవండి : ఫేస్బుక్ ఫ్రెండ్..నగలతో ఉడాయించాడు..!