కమిటీల నివేదిక ఆధారంగా మూడు రాజధానులపై సీఎం నిర్ణయం తీసుకున్నారని, శాసనసభలో కూడా దీనిపై తీర్మానం చేశామని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మూడు రాజధానులను అడ్డుకోవాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సదస్సులు పెట్టడానికే విశాఖను ఉపయోగించారని.. అమరావతిలో సదస్సులు ఎందుకు పెట్టలేదో చెప్పాలని చంద్రబాబును కన్నబాబు ప్రశ్నించారు. ఆయన ఎన్ని శత దినోత్సవాలు జరిపినా.. ప్రభుత్వం మాత్రం అమరావతిని నిర్లక్ష్యం చేయడం లేదని తెలుసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు ఏం మాట్లాడమంటే.. సీపీఐ నేతలు అదే మాట్లాడుతున్నారని కన్నబాబు విమర్శించారు.
ఆ తప్పు జరగకుండా చూస్తున్నాం..
అమరావతితో పాటు విశాఖను, కర్నూలును అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు ముందు అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే జరగడం వలన రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయని.. ఇప్పుడు అలాంటి తప్పు జరగకుండా చూస్తున్నట్టు చెప్పారు. అమరావతికి నష్టం కలిగేంచే పని ఏదీ చేయడం లేదని ముత్తంశెట్టి అన్నారు. అమరావతిని మాత్రమే బాబు కోరుకుంటున్నారని ఆయనకు కొంతమంది వత్తాసు పలుకుతున్నారని మంత్రి ముత్తంశెట్టి విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ప్రయత్నాలు మానుకోలేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: క్రమంగా బలహీనపడుతున్న తీవ్ర వాయుగుండం