ప్రభుత్వానికి సంబంధించిన రూ.800 కోట్ల విలువైన 40 ఎకరాల భూమిని గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆక్రమించుకుని.. కొన్నేళ్లుగా అనుభవిస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ రకంగా కబ్జా చేస్తే ఊరుకోవాలా అని ప్రశ్నించారు. భూమిని రెగ్యులరైజ్ చేయాలని 2014లో గీతం యాజమాన్యం దరఖాస్తు చేసిందని... ఇప్పుడు అక్రమం, అన్యాయం అని మాట్లాడే వాళ్లంతా గత ఐదేళ్లుగా ఎందుకు రెగ్యులరైజ్ చేయలేదని నిలదీశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు.
జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అవినీతికి, లాలూచీలకు అవకాశం లేదన్నది సుస్పష్టమని అవంతి శ్రీనివాసరావు పేర్కొన్నారు. చంద్రబాబుకు, లోకేశ్‌కు గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకులు మూర్తి మీద ప్రేమలేదని.. ఈరోజు రాజకీయం కోసం ప్రేమ ఒలకబోస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఎవరి మీద వ్యక్తిగతంగా ఎటువంటి విద్వేషాలు, కక్ష సాధింపులు లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తుంటే.. బురద జల్లటమే చంద్రబాబు విధానంలా మారిందని విమర్శించారు.
నలభై రోజుల కిందటే గీతం యాజమాన్యం సమక్షంలోనే వాళ్ల సర్వేయర్ల సాక్షిగానే అధికారులు జెండాలు పాతారని చెప్పారు. ప్రభుత్వ భూమి ఏదో తెలియదా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి విధానం సుస్పష్టంగా ఉందని కితాబిచ్చారు. ఆ పార్టీ ఈ పార్టీ అని చూడరని.. ఎవరు తప్పు చేసినా.. తప్పు తప్పుగానే సీఎం జగన్ భావిస్తారని ఉద్ఘాటించారు. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించవద్దని జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు.
ఇదీ చదవండీ... 'జగన్.. సామాజిక న్యాయం సంరక్షకుడిగా మారారు'