Minister Amarnath: రాష్ట్రంలో మున్ముందు ఆప్కో ద్వారా రూ.100 కోట్ల వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. ఆదివారం విశాఖ జడ్పీ సమావేశ మందిరంలో చేనేత దినోత్సవ రాష్ట్రస్థాయి కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. విశాఖలో మెగా ఆప్కో షోరూమ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో 1.50 లక్షల మంది ప్రత్యక్షంగా, 50వేల మంది పరోక్షంగా చేనేత రంగంపై ఉపాధి పొందుతున్నారని, రూ.17.86 కోట్ల ఖర్చుతో 12 కొత్త క్లస్టర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఏపీ హ్యాండ్లూమ్స్ శాఖ అదనపు డైరెక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్ పాల్గొన్నారు.
చేనేతల అభివృద్ధికి రూ.700 కోట్లు వెచ్చించాం
తమ ప్రభుత్వం మూడేళ్లలో చేనేత కార్మికుల అభివృద్ధికి రూ.700 కోట్లు వెచ్చించిందని ఆప్కో ఛైర్మన్ మోహనరావు తెలిపారు. ఇందులో రూ.600 కోట్లు నేతన్ననేస్తం పథకం కింద ఇవ్వగా, ఆప్కో పునరుద్ధరణలో భాగంగా రూ.100 కోట్లు కరోనా సమయంలో మాస్కులు కుట్టేందుకు ఇచ్చిందని పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటుచేసి చేనేత వర్గానికి రాజకీయంగానూ అవకాశాలు కల్పించారని తెలిపారు. విజయవాడలోని ఆప్కో కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో మోహనరావు మాట్లాడారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాలపై అద్భుత కళాఖండాలు నేస్తున్న శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన మాస్టర్ వీవర్ నాగరాజును సన్మానించారు.
నేతన్నలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది: సీఎం జగన్
రాష్ట్రంలోని చేనేత కళాకారులకు ‘నేతన్న నేస్తం’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో జాతి మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో చేనేత ప్రధాన భూమిక పోషించిందని ఆదివారం ఆయన ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి: