విశాఖ జిల్లా సరుగుడు మండల పరిధిలోని భమిడికిలొద్ది కొండపై లేటరైట్ క్వారీ తవ్వకం వివాదాస్పద కేంద్రంగా మారుతోంది. ఈ క్వారీ అనుమతుల నుంచి తవ్వకాలు, చెట్ల తొలగింపు, రహదారి నిర్మాణం వరకు అన్నింటా నిబంధనలు ఉల్లంఘించినట్లు స్థానిక గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఈ క్వారీ వల్ల జరిగే పర్యావరణ నష్టంపై ఇదివరకే జాతీయ హరిత ట్రైబ్యునల్లో ఫిర్యాదు చేశామని దళిత ప్రగతి ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు మరిదియ్య తెలిపారు. 'క్వారీ తవ్వకాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరిగాయి. చెట్లు ఎందుకు తొలగించాల్సి వచ్చింది... తదితర ఏడు అంశాలపై విచారణకు ఎన్టీటీ ఆదేశించి.. ఓ కమిటీని నియమించింది. తాజాగా ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పరిశీలించి పలు లోపాలను గుర్తించి పూర్తిస్థాయిలో నివేదికలకు సిద్ధం చేస్తుంది'.
ఇదీ జరిగింది..
సరుగుడు రెవెన్యూ పరిధిలోని భమిడికిలొద్ది కొండపై నూట ఇరవై ఒక్క హెక్టర్లలో లేటరైట్ క్వారీ లీజు కోసం 2009లో జర్ధా లక్ష్మణరావు దరఖాస్తు చేశాడు. అప్పటి నుంచి ఈ క్వారీపై వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. దరఖాస్తుదారుడు గిరిజనుడు కాదని.. బోగస్ గ్రామసభ తీర్మానం పెట్టారని స్థానికులు కొందరు అప్పట్లోనే కోర్టుని ఆశ్రయించారు. చాలా ఏళ్ల తర్వాత న్యాయస్థానంలో దరఖాస్తుదారునికే అనుకూలంగా 2018లో తీర్పు వచ్చింది. అయినా స్థానికులు వ్యతిరేకించడంతో అప్పట్లో తవ్వకాల జోలికి పోలేదు.
ప్రభుత్వం మారిన తరువాత మరల లీజు దారుడు, అయన వెనుకున్న పెద్దలు పావులు కదిపారు. కోర్టు కూడా ధిక్కార నేరంగా పరిగణిస్తామని చెప్పడంతో అధికారులు ఆగమేఘాలపై అనుమతులిచ్చేశారు. గిరిజనుల రాకపోకల పేరిట క్వారీకి ఉపయోగపడేలా తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ఉపాధి నిధులతో రోడ్డు నిర్మించారు. క్వారీ నుంచి రహదారికి అనుసంధానంగా లీజు దారుడు ఓ రోడ్డు నిర్మించాడని.. ఇందులోనే వేలాది చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా తొలగించినట్లు గిరిజనులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
చెట్లన్ని నేలమట్టం..
సాధారణంగా క్వారీ నుంచి అప్రోచ్ రోడ్డు వేయడానికి ఎనిమిది మీటర్లకు మించి ఉండకూడదనేది నిబంధన. కానీ లేటరైట్ క్వారీ నుంచి సుమారు ఆరు కిలోమీటర్లు మేర 12 నుంచి 15 మీటర్ల వెడల్పుతో భారీ రహదారిని నిర్మించారని స్థానికుల ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రహదారికి అడ్డుగా ఉన్న కొండను తొలిచి వేశారు. పెద్ద పెద్ద వృక్షాలను నేలమట్టం చేశారు. మైనింగ్ చేసే చోట పెద్దఎత్తున చెట్లను నేలకూల్చేశారు. వీటిని తొలగించాలంటే రెవెన్యూ, అటవీశాఖ అనుమతులుండాలి.. అవేవిలేకుండానే మైనింగ్ పెద్దలు తవ్వకాలు మొదలుపెట్టేశారని వాపోయారు.
లేటరైట్ తవ్వకాల వల్ల తమ గ్రామాలకు ముప్పు ఉందని, పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ ఫలసాయంపై ఆధారపడిన తమ కుటుంబాలకు జీవనాధారం పోతుందని స్థానిక గిరిజనులు ఎన్జీటీ బృందం ఎదుట వాపోయారు. వన్యప్రాణులు అంతరించిపోయే ప్రమాదముందని.. తాగు నీటి వనరులు కలుషిమవుతాయని.. సాగునీటి వనరులు దెబ్బతింటాయని చెబుతున్నారు. వెంటనే క్వారీ అనుమతులను రద్దు చేయాలనీ కోరుతున్నారు. ఎన్జీటీ పేర్కొన్న అంశాలపై పూర్తి స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: పార్కు చేసిన కారులో మృతదేహం.. పోలీసుల ముమ్మర దర్యాప్తు