Janasena Leader Peethala Murthy Yadav: విజయసాయి రెడ్డి అల్లుడు, కూతురు పేరిట ఉన్న అవ్వాన్ కంపెనీ దాదాపు లక్ష చదరపు గజాల భూమిని కొనుగోలు చేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వెల్లడించారు. అవ్వాన్ రియల్టర్లకు ఇంత సొమ్ము ఎలా వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం లక్ష రూపాయల మూలధనంతో అవ్వాన్ సంస్థకు కోట్లల్లో నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. వీటిపై ఈడీ విచారణ చేయాలని కోరారు.
గీతం సంస్థ యాజమాన్యం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని బెదిరించి సెక్రెటరీ భరద్వాజ్ ద్వారా ఆరు ఎకరాలు విజయసాయిరెడ్డి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మూర్తి యాదవ్ ఆరోపించారు. రియల్ మాఫియాపై సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. దసపల్లా భూముల విషయంలో యుఎల్సీలో క్లెయిమ్ చేసుకున్న 1800 గజాలు తప్ప.. మిగతా భూమి కమలా రాణికి ఎలా దఖలు పడిందని ప్రశ్నించిన ఆయన... కొండ పొరంబోకు భూములకు గ్రౌండ్ రెంట్ పట్టా ఎలా వచ్చిందన్నారు. యుఎల్సీలోని లోపాల్ని, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై తప్పుడు డాక్యుమెంట్లు కోర్టుకు సమర్పించి భూమిని చేజిక్కించుకున్నారన్నారు.
యుఎల్సీలో పెండింగ్‌లో ఉండగా రాణికే హక్కు లేనప్పుడు 64 మంది ఎలా రిజిస్ట్రేషన్ చేశారన్నారు. కొవిడ్ కోసమే నిధులు అవ్యాన్ సంస్థ నుంచి అస్యూర్ రియల్టర్ ఎల్ఎల్పీకి వచ్చాయని ఉమేష్ అంటున్నారని, అవి ప్రగతి భారతి ఫౌండేషన్ అకౌంట్‌కు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఈ నెలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాబోతున్నారని... జనసేన ఆధారాలతో బయటపెట్టి వీటిపై పోరాడుతుందని మూర్తి యాదవ్ వివరించారు.
"దసపల్లా భూములు కొండ పోరంబోకు భూమి. కమలాదేవికి గ్రౌండ్ రెంట్ పట్టా ఎలా వచ్చింది. భూములు కాజేసి తప్పుడు పత్రాలతో 64 మందికి రిజిస్ట్రేషన్ చేశారు. కమలాదేవికి హక్కు లేకుండా ఆమెకు ఎలా దఖలు పడ్డాయి. గీతం కళాశాలకు చెందిన భరద్వాజ్‌ను బెదిరించి 6 ఎకరాలు రిజిస్ట్రేషన్. అవ్యాన్ రియల్టర్ల పేరిట భీమిలి రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగింది. లక్ష గజాలు విజయసాయి కుమార్తె, అల్లుడు కంపెనీలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వైకాపా పెద్దలు దోచుకున్న భూ కుంభకోణాలన్నీ బయటపెడతాం. చిత్తశుద్ధి ఉంటే విశాఖలో భూ కుంభకోణాలపై విచారణ చేయాలి. విశాఖ భూముల విషయంలో క్విడ్‌ప్రోకో జరిగింది. రెండు సిట్ నివేదికలను బయటపెట్టాలి. మొత్తం వ్యవహారంపై ఈడీ, సీబీఐ విచారణ చేయాలి. అవ్యాన్ రియల్టర్లకు ఇంత సొమ్ము ఎలా వచ్చిందో చెప్పాలి." -జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్
ఇవీ చదవండి: