కృష్ణా జిల్లా నాగాయలంక మండలం మర్రిపాలెంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 25 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సంగమేశ్వరం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ప్రకాశం జిల్లాలో...
ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండల అటవీ ప్రాంతంలో నాటు సారా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. 700లీటర్ల బెల్లం ఊటను, సారా తయారీకి ఉపయోగించే డ్రమ్ములను ధ్వంసం చేశారు.
విజయనగరంలో..
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర చెక్‌పోస్ట్ వద్ద అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 2,185 కిలోల గంజాయి పట్టుబడింది. అరకు వైపు నుంచి వస్తున్న ఐచర్ వ్యాన్‌లో 80 బస్తాల్లో సరుకును తరలిస్తుండగా పోలీసుల చేతికి చిక్కింది. పట్టుబడ్డ గంజాయి విలువ రూ.కోటికి పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. కేసుతో సంబంధం ఉన్న వారి గురించి దర్యాప్తు సాగిస్తున్నారు.
విశాఖలో ప్రత్యేక డ్రైవ్..
విశాఖలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి అజిత వేజెండ్ల తెలిపారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. రెండు కేసులకు సంబంధించి 64 కిలోల సరకు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అరెస్టయిన వారిలో ఇద్దరు కోల్‌కతాకు చెందిన స్మగ్లర్లు కాగా.. మరో ఇద్దరు బాల నేరస్తులని వివరించారు. మరో కేసులో పాన్ మసాలా మత్తు పదార్థాలను సీజ్ చేశామని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా డ్రగ్ వ్యవహారాలపై నిఘా పెంచాతామని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ఇదీ చదవండి: అమరావతికి సీఎం జగన్ మరణ శాసనం రాశారు: పంచుమర్తి