జాతీయ పట్టణాభివృద్ధి పథకం ద్వారా... విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం 2005 నవంబరు 21న నగరపాలక సంస్థగా మార్చారు. విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న 32 గ్రామాలను, గాజువాక పురపాలక సంఘాన్ని దీంట్లో విలీనం చేశారు. 9.82 లక్షల జనాభా ఉన్న విశాఖ... ఈ 32 గ్రామాలు, గాజువాక పురపాలక సంఘం కలిసిన తర్వాత 14.25 లక్షల జనాభాకి పెరిగింది.
పరిపాలన...
నగర పరిపాలనను విశాఖ మహానగర పాలక సంస్థ నిర్వహిస్తోంది. దీనికి అధిపతి మేయర్ అయినప్పటికీ... కార్యనిర్వాహక అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం నియమించే నగరపాలక కమిషనర్ చేతిలో ఉంటాయి. సీనియర్ ఐఏఎస్ అధికారిని నగరపాలక సంస్థ కమిషనర్గా ప్రభుత్వం నియమిస్తుంది. నగరపాలక కమిషనర్ వివిధ విభాగాల అధికారుల సమన్వయంతో... అభివృద్ధికి చర్యలు తీసుకుంటారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మేయర్, డివిజన్ల కార్పోరేటర్ల సలహాలు, సూచనలు, ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకుంటారు.
నిధులు-విధులు..
నగర విస్తీర్ణం, జనాభా సంఖ్య ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల కింద ప్రత్యేకంగా నిధులు మంజూరవుతాయి. ఈ నిధులను ఎలా ఖర్చు చేయాలి, దేనికి కేటాయించాలనేది నిర్ణయిస్తారు. మహా నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం గ్రేటర్ మేయర్ అధ్యక్షతన నిర్వహించి.. చర్చించి ఏయే పనులు చేయాలో నిర్ణయిస్తారు. ఈ సర్వసభ్య సమావేశంలో... మేయర్, కార్పోరేటర్లే కాకుండా... స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొని సలహాలు, సూచనలు ఇస్తారు.
మహానగర ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం, రోడ్ల విస్తరణ, మరమ్మతులు, డ్రైనేజీ నిర్వహణ, నిర్మాణం, చెత్త సేకరణ, తొలిగింపు, వీధి దీపాల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన బాధ్యత మహానగర పాలక సంస్థపై ఉంటుంది. ఇవే కాకుండా ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు, నూతన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం సంస్థ పరిధిలోని అంశాలు. ఇవే కాకుండా... పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సర్వసభ్య సమావేశంలో తీర్మానాలు చేసి అమలు చేస్తారు.
14 ఏళ్ల తర్వాత...
పలు అవాంతరాల కారణంగా పలుమార్లు జీవీఎంసీ ఎన్నికలు వాయిదాపడ్డాయి. 14 ఏళ్ల తర్వాత మళ్లీ జీవీఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు విశాఖపై దృష్టి పెట్టాయి. 2007 ఫిబ్రవరి 19న జీవీఎంసీకి ఎన్నికలు జరిగాయి. మళ్లీ ఆ తర్వాత ఇప్పుడు.. 2021 మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. విశాఖపట్నంలో 14 ఏళ్లు పాటు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది.
ఇదీ చదవండీ... పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు: హైకోర్టు