విశాఖ వాసులను ఐదేళ్లుగా ఊరిస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు మరింత ఆలస్యం కానున్నాయి. ప్రాజెక్టు కోసం గతంలో డీపీఆర్‌ల రూపకల్పనకు ఎస్సెల్ ఇన్‌ఫ్రా కన్సార్షియానికి ఇచ్చిన ఉత్తర్వులను ప్రభత్వం రద్దు చేసింది. కొత్త డీపీఆర్‌ల రూపకల్పనకు ప్రతిపాదనలు పిలవాల్సిందిగా ఏపీ మెట్రో రైల్ ఎండీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. వివిధ సంస్థల నుంచి కొటేషన్లు పిలిచేందుకు ఎండీకి అనుమతినిస్తూ పురపాలకశాఖ ఆదేశాలు జారీ చేసింది.
విశాఖ నగరంలో 3 కారిడార్లలో 79.9 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ నిర్మాణం కోసం కొత్త డీపీఆర్‌ల రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీపీఆర్‌ల రూపకల్పనకు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, రైట్స్, యూఎంటీసీ వంటి సంస్థలను సంప్రదించాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 60 కిలోమీటర్ల మేర మోడర్న్ ట్రామ్ కారిడార్‌కు మరో డీపీఆర్ సిద్ధం చేసేందుకు అమరావతి మెట్రో రైల్ ఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం... డీపీఆర్‌ల రూపకల్పన కోసం కొటేషన్లు పిలిచేందుకు అనుమతిచ్చింది.
విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం పర్యావరణహితంగా విధివిధానాలను పూర్తిచేసింది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్‌కు విశాఖ నరగపాలక సంస్థ ప్రతిపాదించిన విధంగా... 42.55 కిలోమీటర్ల మెట్రోను 3 కారిడార్‌లుగా రూపుదిద్దేందుకు తొలి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీని కోసం కమిషనర్ ప్రతిపాదనలు సమర్పించగా... పట్టణాభివృద్ధి శాఖ దానిని ఆమోదించింది. పీపీపీ- వీఎంఆర్డీఏ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు ప్రజారవాణా వ్యవస్థలో కొత్త అధ్యాయానికి తెరతీస్తుందని అందరూ భావించారు. సుమారు 8వేల 800 కోట్ల రూపాయలతో విశాఖ మెట్రో నిర్మాణానికి కొన్ని విదేశీ సంస్థలు ఆసక్తి చూపాయి.
ప్రభుత్వం మారిన తర్వాత విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. విదేశీ రుణంతో పీపీపీ విధానంలో ఓ కొలిక్కి వస్తుందనుకున్న తరుణంలో ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. కేంద్రం కూడా విశాఖకు మోనోరైలు సరిపోతుందని చెప్పింది. ఈ పరిస్థితుల్లో... నిర్మాణానికి ముందుకొచ్చిన విదేశీ సంస్థలు వెనుదిరిగాయి. ప్రజారవాణా వ్యవస్థలో కొత్తదనాన్ని తీసుకొచ్చే మెట్రో, మోనో రైలు, ట్రామ్ వ్యవస్థల్లో ఏదో ఒకదానిని తొందరగా అందుబాటులోకి తీసుకురావాలని విశాఖ ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండీ... పర్యావరణాన్ని దెబ్బతీసినందుకు రూ.5.28 కోట్ల జరిమానా