విశాఖ నగర నడిబొడ్డున మర్రిపాలెం ప్రాంతంలో సర్వే నెంబరు 81/3లో ఓ ప్రైవేటు వ్యక్తి ఆధీనంలో ఉన్న సుమారు రూ.100 కోట్లకు పైగా విలువైన 17,135 చదరపు మీటర్ల భూమి స్వాధీనానికి ప్రభుత్వం గురువారం రాత్రి 115 జీవో జారీ చేసింది. ఈ భూమి విషయంలోనే గతంలో కడపకు చెందిన కొంతమంది వ్యక్తులు తన ఇంటికొచ్చి మరీ బెదిరించారని స్థల యజమాని బంధువు, నగరానికి చెందిన ఓ.నరేశ్‌కుమార్ అప్పట్లో పోలీసులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆ స్థలానికి సంరక్షకుడిగా వ్యవహరిస్తున్నారు. నరేశ్ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేశారు. అది పెండింగులో ఉండగానే ఆ స్థలం మొత్తం ప్రభుత్వానిదేనని తాజాగా జీవో రావడం గమనార్హం.
ఇదీ నేపథ్యం...
ఆ భూమి జోస్యుల భువనేశ్వరదాస్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులకు చెందినది. తొలుత దాన్ని మిగులు భూమిగా చూపించి ప్రభుత్వానికి అప్పగించారు. ఆ తర్వాత నిర్ణీత మొత్తం చెల్లించి క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని యజమానులకు ప్రభుత్వమే కల్పించింది. దీంతో భువనేశ్వరదాస్ కుమారుడు సత్యనారాయణదాస్ కుటుంబ సభ్యులు, వారసులు ప్రభుత్వానికి డబ్బు చెల్లించి క్రమబద్ధీకరించుకున్నారు. అనంతరం ఆ భూమిని కాట్రగడ్డ లలితేష్ అనే వ్యక్తి కొనుగోలు చేశారు. నాటి నుంచి ఆ భూమి ఆయన స్వాధీనంలోనే ఉంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను చెల్లిస్తూ వినియోగించుకుంటున్నారు. మధ్యలో ఓసారి ప్రభుత్వం ఆయనకు నోటీసులు జారీ చేసి క్రమబద్ధీకరణ ప్రక్రియలలో తప్పిదాలున్నాయని, ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని పేర్కొంది. దీనిపై స్థల యజమానులు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. క్రమబద్ధీకరణ వ్యవహారం అంతా చట్టబద్ధంగానే జరిగిందని... తమకు ఇచ్చిన నోటీసులను ఉపసంహరింప చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అనంతరం న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం నోటీసులను ఉపసంహరించుకుంది. ఆ తర్వాత 2014లో ప్రభుత్వం మళ్లీ నోటీసులు జారీ చేసింది. దీంతో స్థల యజమానులు మళ్లీ ప్రభుత్వానికి వివరణ రాసి ఆ స్థలం తమకు చట్టబద్ధంగా ఏవిధంగా సంక్రమించిందో వివరాలను అందులో పొందుపరిచారు. ఈ క్రమంలో తాజాగా ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండానే ప్రభుత్వం స్థలం స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభిస్తూ గురువారం హఠాత్తుగా జీవో జారీ చేయడం గమనార్హం.
'స్థలం కొనుగోలు విషయంలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదు. పదేళ్లుగా ఆ స్థలం మా స్వాధీనంలోనే ఉంది. న్యాయస్థానం మాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. లాక్‌డౌన్ ఎత్తేవరకు భూముల స్వాధీనానికి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకూడదని రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలిచ్చినా ప్రభుత్వం జీవో విడుదల చేయడం బాధాకరం' అని నరేశ్‌కుమార్ పేర్కొన్నారు.