ద్వారకానగర్‌లో కనిపించిందీ దృశ్యం. విద్యుత్తు స్తంభాలకు విపరీతంగా కేబుళ్లను కట్టేసి ఉంచారు. ఒక స్తంభం నుంచి మరో స్తంభం మధ్య వందకు పైగా తీగలు అతి తక్కువ ఎత్తులోనే వేలాడుతున్నాయి. అటుగా వెళ్లే వారి తలకు తగేలాలా ఉన్నాయి. వీటిపై జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందించడంలేదు.
ప్రమాణాలు గాల్లోకి: నగరంలో జీవీఎంసీ రోడ్లే ఎక్కువగా ఉన్నాయి. వాటిద్వారా కేబుళ్లు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా అనుమతులు పొంది అధికారులు సూచించినట్లుగానే తీగలు తీసుకెళ్లాలి. కానీ అధికారులెక్కడా ఆ తీగలకు నిర్దిష్ట దారిని చూపట్లేదు. అనుమతిచ్చి వదిలేస్తున్నారు. దీంతో వీధుల్లో, ప్రధాన దారుల్లో వీటిని ఇష్టానుసారంగా లాగి, ఎక్కపడితే అక్కడ కట్టేసి కనెక్షన్లు ఇచ్చేస్తున్నారు. నివాస, దుకాణ సముదాయాలు ఎక్కువగా ఉన్నచోట్ల ఇవి మరింత అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాయి. అక్కయ్యపాలెం, దొండపర్తి, ఆశీల్‌మెట్ట, జగదాంబకూడలి పరిసర ప్రాంతాలు, బీచ్‌రోడ్డులోని కాలనీలు.. ఇలా చాలా చోట్ల వీటి వ్యవస్థ గందరగోళంగానే ఉంది.
పద్ధతంటూ లేదు.. నియంత్రించేవారూ లేరు.. నగరంలో ఇంటర్నెట్ ఫైబర్‌కేబుళ్ల నిర్వహణ అత్యంత అధ్వానంగా మారింది. నిబంధనల్ని అతిక్రమించి ఇష్టానుసారం రోడ్లకు అడ్డంగా... తలలకు తగిలేలా చాలాప్రాంతాల్లో ఈ తీగలు వేలాడుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రమాదకరంగా మారాయి.
విశాఖను స్మార్ట్‌సిటీగా ఎంపిక చేశాక.. కొన్ని ప్రాంతాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో ఫైబర్ కేబుళ్లను నియంత్రించి, వాటిని నడకబాటల కింద నుంచి తీసుకెళ్లాలనేది ఓ ప్రతిపాదన. అది ఇప్పటికీ అమలవలేదు. లాక్‌డౌన్ తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్లు కూడా బాగా పెరిగాయి. వర్క్‌ఫ్రమ్ హోమ్‌తో ఇంకా డిమాండ్ పెరిగింది. దీంతో చాలా ప్రాంతాల్లో ఈ ఫైబర్ తీగలు పరిమితికి మించి భారీగా పెరిగిపోయాయి.
'భూగర్భం'లో అవదు...
భూగర్భ విద్యుత్తుతీగల పనులు జరుగుతున్న ప్రాంతాల్లో, నడకబాటలు ఏర్పాటుచేసి వాటికింద నుంచే ఇంటర్నెట్ ఫైబర్, టీవీ కేబుళ్లు కూడా వెళ్లేలా భూమిలో సమీకృత వాహకాల్ని (ఇంటిగ్రేటెడ్ డక్ట్) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 2016లో జీవీఎంసీ అధికారులు, ఇతర శాఖాధికారులు దీనికి సర్వే కూడా పూర్తిచేశారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు అర్థాంతరంగా ఆగిపోయింది. ఖర్చు ఎక్కువ అవుతుందనే ఆలోచనతో ఇలా చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
* మరోవైపు బీఆర్టీఎస్ మార్గంలో 62 కి.మీ మేర నడకబాటల కింద తీగల కోసం ప్రత్యేక పరికరాలు ఏర్పాటుచేసినట్లు గతంలో జీవీఎంసీ అధికారులు వెల్లడించారు. వీటిని ఇప్పటికీ వినియోగంలోకి తీసుకురావడంలేదు.
ఇతర నగరాల్లో ఇలా...
* బెంగళూరు, కోల్‌కతా నగరపాలక సంస్థల్లో ఫైబర్ కేబుళ్ల నిర్వహణకు కఠిన నిబంధనల్ని తీసుకొస్తున్నారు. ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా ఉన్న ఆ వ్యవస్థను ప్రత్యేక డ్రైవ్‌లు పెట్టి తీసేస్తున్నారు.
* బెంగళూరులో చాలా చోట్ల భూగర్భకేబుల్ వ్యవస్థకు వీటిని అనుసంధానం చేశారు. స్థానికంగా జోనల్ ఇంజినీర్ల అనుమతితో ఇవి చేపట్టారు. ఉపరితల కేబుళ్లకు అనుమతి ఇవ్వడంలేదు.
* కోల్‌కతాలోనూ చర్యలు చేపట్టారు. అక్కడ ఈ తీగలవల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని గుర్తించారు. రోడ్ల చివర్లో ప్రత్యేక గోట్టాల్ని అమర్చి వాటిద్వారా తీగలు తీసుకెళ్లేలా ప్రణాళికలు చేశారు.
ఎంతలా 'అల్లుకున్నాయో'...
డైమండ్‌పార్క్ దగ్గర ఓ స్తంభం నిండా ఇంటర్నెట్ ఫైబర్ తీగలే ఉన్నాయి. కొన్ని మొక్కలు ఆ తీగల ఆధారంగా పూర్తిగా అల్లుకున్నాయి. ఈ పరిస్థితి చాలా నెలలుగానే అక్కడున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వాటిలో పనికొచ్చే కనెక్షన్లేవో, యాక్టివ్‌గా లేని కనెక్షన్లేవో కూడా తెలీదని చెబుతున్నారు.
ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం: 'ఫైబర్ కేబుల్ వ్యవస్థ నగరంలో ఇబ్బందిగానే ఉంది. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వాటిని తొలగిస్తాం. ఆయా కంపెనీలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తాం. కొన్ని రోడ్లపై, కూడళ్లలో ఇవి ప్రమాదకరంగా ఉన్నాయి. అన్ని కంపెనీలూ భూగర్భంలోనే తమ తీగల్ని ఏర్పాటు చేసుకునేలా ప్రణాళికలు వేసుకోవాలి’ అని కమిషనర్ సృజన సేర్కొన్నారు.
ఇదీ చదవండి: