రాష్ట్రంలోని టోల్‌గేట్ల వద్ద వాహనదారుల సమయం వృథా కాకుండా జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ తీసుకొచ్చిన ఫాస్టాగ్ విధానానికి టోల్‌గేట్ల గుత్తేదారులు తూట్లు పొడుస్తున్నారు. టోల్‌గేట్ల దగ్గర సునాయాసంగా వెళ్లిపోవచ్చని భావించి ఫాస్టాగ్ వేయించుకున్న వాహనదారుల అంచనాలు క్షేత్రస్థాయిలో తలకిందులవుతున్నాయి. ఫాస్టాగ్ ఉన్న వాహనాల రాకపోకలకు వీలుగా టోల్‌గేట్ల దగ్గర ప్రత్యేక వరుసలు(డెడికేటెడ్ లైన్స్) అందుబాటులో ఉంటాయని... నగదు చెల్లించేవారికి ఒక మార్గం మాత్రమే అందుబాటులో ఉంచుతామని అధికారులు ప్రకటించారు. కొంతకాలంపాటు ఆ విధానాన్ని విజయవంతంగా అమలు చేశారు. నగదు చెల్లింపు వరుసలో వాహనాలు బారులు తీరుతున్నాయన్న ఉద్దేశంతో ఆయా వాహనాలను కూడా ప్రత్యేక ఫాస్టాగ్ వరుసల్లోకి ఇష్టారాజ్యంగా అనుమతిస్తున్నారు. ఫలితంగా ఫాస్టాగ్ ఉన్న వాహనదారులు కూడా టోల్‌గేట్ల దగ్గర నిరీక్షించక తప్పడంలేదు. దీంతో ఫాస్టాగ్ వ్యవస్థ లక్ష్యమే దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.
- రాష్ట్రంలో మొత్తం టోల్‌గేట్ల సంఖ్యం 43, వీటిగుండా ఫాస్టాగ్‌తో ప్రయాణించే వాహనాలు సుమారు 75శాతం మాత్రమే. నేటికీ ఫాస్టాగ్ లేకుండా ప్రయాణించేవి 25 శాతం ఉన్నాయి.
- ఫాస్టాగ్ లైన్లకు ఆనుకుని విభాగినులపై నగదు వసూళ్ల క్యాబిన్లు యథాతథంగా కొనసాగుతున్నాయి. అందులో సిబ్బందిని కూడా యథాతథంగానే ఉంచి అన్ని వరుసల్లోనూ నగదు వసూళ్లకు అనుమతి ఇస్తున్నారు.
- నగదు చెల్లింపుదారులు ఫాస్టాగ్ లైన్లలోకి వస్తే రెట్టింపు టోలు రుసుమును వసూలు చేయాలన్న నిబంధనను అమలు చేయకపోవడంతో నగదు చెల్లింపుదారులు కూడా ఫాస్టాగ్ లైన్లలో బారులు తీరుతున్నారు.
- టోల్‌గేట్ల దగ్గర ఫాస్టాగ్‌లు లభ్యమవుతున్నప్పటికీ అవి వినియోగంలోకి రావడానికి రెండు మూడు రోజులు పడుతుండడంతో అప్పటికప్పుడు కొనుగోలు చేద్దామనుకున్నా ఉపయోగం ఉండడంలేదు. దీంతోపాటు దరఖాస్తు పూర్తిచేయడం, వాహన రిజిస్ట్రేషన్ వివరాలను, గుర్తింపుకార్డు తదితర వివరాలు ఇవ్వడానికి చాలామంది వాహనదారులు ఆసక్తిచూపడంలేదు.
- టోల్‌గేట్ల వద్ద చెల్లించాల్సిన రుసుముకు సరిపడా మొత్తాన్ని ప్రయాణానికి కనీసం గంట ముందే ఫాస్టాగ్‌లో ఉండేలా సరిచూసుకోవాలి. అప్పటికప్పుడు ఫాస్టాగ్‌కు నగదు బదిలీ చేస్తే ‘బ్లాక్‌లిస్ట్’లో ఉన్నట్లు సందేశం వస్తుందన్న విషయంపై చాలామందికి అవగాహన ఉండడంలేదు.
ఫాస్టాగ్ లేని వాహనాల వల్లే సమస్యలు
"విశాఖ వాహనదారుల్లో సుమారు 25 శాతం మందికి ఫాస్టాగ్ ఉండడంలేదు. వారి కారణంగానే ఫాస్టాగ్ విధానానికి సమస్యలు ఎదురవుతున్నాయి. నగదు చెల్లింపులు చేసే అలాంటి వారి కోసం టోల్‌గేట్ల దగ్గర ఒక్క వరుసలోని మార్గాన్ని మాత్రమే అనుమతిస్తుండడంతో తీవ్రమైన రద్దీ ఏర్పడి..వాహనదారులు అవస్థలు పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మాత్రమే ఫాస్టాగ్ వరుసల్లోకి అనుమతించాలని టోల్‌గేట్ల గుత్తేదారులకు సూచించాం. కానీ కొందరు యథేచ్ఛగా ఫాస్టాగ్ వరుసల్లోకి ఇతర వాహనాలను పంపుతున్నారన్న ఫిర్యాదులు మాకు అందాయి. అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకుంటాం."
--- శివశంకర్, పి.డి, ఎన్.హెచ్.ఎ.ఐ
ఇదీ చదవండి