ఉపాధ్యాయ నియామక పరీక్షల మెరిట్ జాబితాను ఈ నెల 15న విడుదల చేయనున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. 7,902 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా... 6,08,150 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 85.81 శాతం మంది పరీక్ష రాసినట్లు మంత్రి గంటా విశాఖ మీడియా సమావేశంలో వెల్లడించారు.
పది, ఇంటర్ పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు
పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల ఏర్పాట్లను పూర్తి చేశామని మంత్రి గంటా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల 838 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు 6 లక్షల 21 వేల 623 మంది విద్యార్థులు హాజరవుతారని మంత్రి గంటా ప్రకటించారు. ఏప్రిల్ 27న పదో తరగతి ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని.. 10 లక్షల 17 వేల 600 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. 1430 కేంద్రాలు ఏర్పాటు చేశామని.. ఏప్రిల్ 12న ఇంటర్ ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు.