ఎటువంటి అభివృద్ధి ప్రణాళికలు లేకుండా విశాఖ నగరంలోని మురికివాడల్లో నివాసం ఉంటున్న పేద ప్రజలపై గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న సర్వే.. పలు అనుమానాలకు తావిస్తోందని సీపీఎం విశాఖ నగర కమిటీ అభిప్రాయపడింది. సర్వేలో పేర్కొన్న విషయాలు.. అడుగుతున్న ఆధారాలు, డాక్యుమెంట్లను చూస్తుంటే మురికివాడలను అక్కడినుంచి తొలగిస్తారనే భయాందోళనలు నెలకొంటున్నాయని నగర కమిటీ కార్యదర్శి బి.గంగారావు అన్నారు. గతంలో విశాఖ నగరంలో ఉన్న కొన్ని మురికివాడలను నగర శివార్లకు తరలించి ఇప్పటికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని చెబుతున్న జీవీఎంసీ అధికారులు.. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇష్టానుసారంగా సర్వే నిర్వహించడం సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మురికివాడల సర్వేపై గత కౌన్సిల్ సమావేశంలో కనీసం ప్రస్తావించకుండా.. ఇప్పుడు హడావుడిగా సర్వే నిర్వహించడంపై సీపీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మురికివాడలను తరలించే ప్రయత్నం చేస్తే ప్రతిఘటన తప్పదని నేతలు హెచ్చరించారు. మురికివాడల అభివృద్ధికి బడ్జెట్లో 40 శాతం నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు వారికి భూ హక్కులు కూడా కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: