విశాఖపట్నంలో పుర ఎన్నికల ప్రచారం సందర్భంగా అరుదైన ఘటన చోటు చేసుకుంది. జీవీఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి తరఫున సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రచారంలో పాల్గొన్నారు. 97వ వార్డులో పర్యటించారు. శ్రీశారదా పీఠం ఇదే వార్డులో ఉంది. ప్రచారంలో వెళ్తున్న నారాయణ దృష్టి ఈ పీఠంపై పడింది. సార్... ఇదే శ్రీ శారదాపీఠం, ముఖ్యమంత్రి జగన్ ఇక్కడికే వస్తుంటారని కార్యకర్తలు వివరించారు.
పదండి అసలు ఏం జరుగుతుందో చూద్దాం అని నారాయణ గేట్లోపలికి వెళ్లారు. నారాయణ వచ్చిన విషయాన్ని పీఠం నిర్వాహకులు స్వరూపానందేంద్ర సరస్వతికి చెప్పారు. స్వామీజీ అందరినీ కలిసే మందిరంలోకి నారాయణను పీఠం నిర్వాహకులు అహ్వానించారు. స్వరూపానందేంద్ర స్వామీజీ నారాయణను పలకరించారు. పలు అంశాలపై ముచ్చటించారు. దాదాపు 15 నిమిషాలు వీరిద్దరి మధ్య సంభాషణ సాగింది. 97వ వార్డు సీపీఐ అభ్యర్థిని యశోదను... నారాయణ స్వామీజీకి పరిచయం చేశారు. ''స్వామీజీ.. మిమ్మల్ని కలిసి గెలిపించాలని కోరిన వారందరినీ గెలిపిస్తారంటగా... మా పార్టీ అభ్యర్థిని కూడా గెలిపించండి'' అని కోరారు.
స్వామీజీ, నారాయణ మధ్య సంభాషణ సాగిందిలా...
నారాయణ: నా మాటలు మీకు అప్రియంగా ఉంటాయి కదా.
స్వామీజీ: మీ విమర్శలు సమస్యలపై ఘాటుగా ఉంటాయి. వాటిని నేను ఇష్టపడతాను. మీరంటే నాకు ఇష్టం.
నారాయణ: ఎవరూ వారివారి పరిధుల్లో లక్ష్మణ రేఖ దాటకుండా ఉంటే బాగుంటుంది కదా. విశ్వాసాల విషయంలో ఎటువంటి ఘర్షణ లేకుండా ఉండాలి కదా.
స్వామీజీ: పరస్పరం గౌరవించుకోవడమే హిందూ ధర్మం. ఇందులో ఎక్కడా సమస్యే ఉండదు.
నారాయణ: నాకు అన్నమయ్య గీతాలు, కీర్తనలు ఎంతో ఇష్టం. ఇందులో ఎక్కడా... కుల, మతతత్త్వాలు లేవు కదా. వేదాలలో కుల విభజన జరిగిందని చెబుతారు కదా. మతం అనుసరణ, రాజకీయ వ్యవస్థ ఒకదాని రేఖ మరొకటి దాటకూడదు కదా.
స్వామీజి: వేదాల్లో వృత్తులను మాత్రమే ప్రస్తావించినట్టుగా ఉంది. కాల గమనంలో అవి కులాలుగా విభజించుకున్నట్టుగా అర్థమవుతోంది. వేద కాలంలో కులమతాల ప్రస్తావన లేదు. ధర్మాన్ని అచరించడమే ప్రామాణికంగా ఉంటుంది.
పీఠం నుంచి బయటకు వస్తున్న సమయంలో నారాయణకు శాలువా కప్పి స్వామీజీ గౌరవించారు. వీరి కలయికపై రాజకీయ వర్గాలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇదీ చదవండీ... త్వరలో గంటా శ్రీనివాసరావు వైకాపాలో చేరే అవకాశం: విజయసాయిరెడ్డి