ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ.. జెన్నర్ ఇనిస్టిట్యూట్, ఆస్ట్రాజెనికా ఫార్మా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ కొవిషీల్డ్. ఈ వ్యాక్సిన్ తయారీకి పుణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ)..ఒప్పందం చేసుకుంది. దేశంలోని పలు ఆసుపత్రుల్లో కొవిషీల్డ్ వ్యాక్సిన్ మానవ ప్రయోగాలు జరుగుతున్నాయి. వాటిల్లో ఒకటి విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి. కేజీహెచ్‌లో కొవిషీల్డ్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి.
కొవిషీల్డ్ క్లినికల్ ట్రైల్స్ కోసం అత్యాధునిక వైద్య సదుపాయాలతో ప్రత్యేక వార్డును ఏర్పాటుచేశారు. ఈ వార్డులో వందల సంఖ్యలో ఆక్సిజన్ సౌకర్యం కలిగిన పడకలు, ప్లాస్మా దానం కోసం అఫెరెసిస్ మెషీన్ కేజీహెచ్‌ను కొవిడ్ వైద్య సేవల్లో ప్రత్యేకంగా నిలిపాయి. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు కేజీహెచ్ పర్యవేక్షణాధికారి పి.వి. సుధాకర్ ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు.
- ప్రశ్న. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ మానవ ప్రయోగాలు ఎలా జరుగుతున్నాయి. అవి పూర్తవడానికి ఎంత సమయం పట్టొచ్చు?
జవాబు: మన దేశంలో 3 రకాల కొవిడ్ వ్యాక్సిన్లు ప్రయోగదశలో ఉన్నాయి. కేజీహెచ్‌లో కొవిషీల్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రైల్స్ నిర్వహణ ఏర్పాట్ల కోసం 2 నెలలు శ్రమించాం. ఈ నెల 5 నుంచి వాలంటీర్లకు టీకా వేస్తున్నాం. మొదటి రోజు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత 29వ రోజు రెండో డోస్ వ్యాక్సిన్ ఇస్తాం. ఒక వాలంటీర్‌పై ప్రయోగం పూర్తయ్యేందుకు 6 నెలల సమయం పడుతుంది. మొదటిరోజు అనంతరం మరో 5 సార్లు సదరు వ్యక్తి ఆసుపత్రికి రావాల్సి ఉంటుంది. ఈ సమయంలో వివిధ వైద్య పరీక్షలు చేస్తాం. పరీక్షా ఫలితాల సమాచారాన్ని సీరం ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు పంపిస్తాం. ఆ ఫలితాలను క్రోడీకరించిన తర్వాత వ్యాక్సిన్ పని తీరుపై నిర్ధరణకు వస్తారు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది.
- ప్రశ్న. మానవ ప్రయోగాల కోసం ఎంత మంది వాలంటీర్లకు అవకాశం ఉంటుంది. వారిని పర్యవేక్షించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
జ. కేజీహెచ్‌లో చేస్తున్న క్లినికల్ ట్రైల్స్ కోసం 100 మంది వాలంటీర్లు కావాలి. వివిధ రంగాలకు చెందిన వారు ఆసక్తి కనబరుస్తున్నారు. వారికి పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేకుండా మద్యం, ధూమపానానికి బానిసలు కాని వారు వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉంటుంది. టీకా వేసిన అనంతరం 30 నిమిషాలు ఆసుపత్రిలో ఉంటారు. టీకా తీసుకున్న వారికి ప్రత్యేకంగా నియమించిన వైద్యుల ఫోన్ నెంబర్లు ఇస్తున్నాం. ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించే ఏర్పాట్లు చేశాం. పూర్తిస్థాయి వైద్య సదుపాయాలతో హ్యూమన్ ట్రైల్స్ కోసం ప్రత్యేక వార్డు అందుబాటులో ఉంది.
- ప్రశ్న. కొవిడ్ చికిత్స కోసం కేజీహెచ్‌లో సీఎస్ఆర్ బ్లాక్ ఎలా ఉపయోగపడుతోంది. వైద్య సేవలపై ఎలాంటి సంతృప్తి కనిపిస్తోంది?
జ. గత నెలలో ప్రారంభించిన సీఎస్ఆర్ బ్లాక్ కొవిడ్ రోగులకు అత్యాధునిక వైద్య చికిత్స అందించేందుకు వినియోగిస్తున్నాం. ఇందులో ఉన్న 500 పడకలకు పూర్తిగా ఆక్సిజన్ సరఫరా ఉండడం ఇక్కడి ప్రత్యేకత. అందులో 200 వెంటిలేటర్లు ఉన్నాయి. సీసీ కెమరాలతో వార్డుల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. ఈ సదుపాయాన్ని రోగి బంధువులకు అందుబాటులో ఉంచుతున్నాం. ఫలితంగా రోగి బాగోగులు నేరుగా చూసే అవకాశం బంధువులకు కలుగుతోంది. కిడ్నీ పేషెంట్లు కోసం డయాలసిస్ చేస్తున్నాం. ప్రసూతి సేవల కోసం 5వ ఫ్లోర్‌ను కేటాయించాం. సిజేరియన్ నిర్వహించేందుకు 3 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి.
- ప్రశ్న. ప్లాస్మాదానం చేసేందుకు ప్రత్యేక యూనిట్ ప్రారంభించారు. ప్లాస్మా అవసరం ఎలా ఉంది. దాతలు ముందుకు వస్తున్నారా?
జ. ప్లాస్మా ఇచ్చినా కొవిడ్ రోగుల్లో సమస్యలు, మరణాల శాతం అంతగా తగ్గలేదని ఐసీఎంఆర్ అభిప్రాయపడింది. ఆ ప్రకటనతో కొంత అయోమయ పరిస్థితి ఏర్పడింది. కానీ, ఈ విషయంలో వైద్యుల అనుభవం వేరే విధంగా ఉంది. ప్లాస్మా ఇస్తే త్వరగాకోలుకోవడం, ఆరోగ్యంగా మారడం వంటివి వైద్యులు గమనించారు. పూర్తిగా ప్లాస్మా అవసరం లేదని చెప్పలేం. 500 మందికి ప్లాస్మా సేకరించడానికి అవసరమైన ఏర్పాట్లు కేజీహెచ్‌లో చేశాం. కలెక్టర్ వినయ్ చంద్ అఫెరెసిస్ విభాగం ఏర్పాటుకు నిధులు కేటాయించారు. కొవిడ్ నుంచి కోలుకుని 28 రోజులు దాటిన ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానం చేసేందుకు కేజీహెచ్‌కు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇదీ చదవండి :