సాగరతీర నగరమైన విశాఖలో ఉన్న భారీ పరిశ్రమలు ఆర్థిక వ్యవస్ధలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారం, బీహెచ్ఈఎల్, హిందుస్థాన్ షిప్ యార్డు, నేవల్ డాక్ యార్డు, హెచ్పీసీఎల్ పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావడంతో లాక్డౌన్ ఒత్తిడిని తట్టుకోగలిగే పరిస్థితి ఉన్నప్పటికీ వీటికి అనుబంధంగా పనిచేస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మాత్రం నష్టాల్లో కూరుకుపోతున్నాయి.
ఉత్పత్తి యధాతథస్థితి ఎప్పుడోస్తుందో అని పరిశ్రమ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ వల్ల ఎంత వరకూ ఉపశమనం కలుగుతుందో స్పష్టత లేదని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. గతంలో వందశాతం కార్మికులతో చేసే పనులను ఇప్పుడు కేవలం 30 నుంచి 40 శాతం మందితో చేయాల్సి వస్తోందని అంటున్నారు. పలు రిటర్న్లు దాఖలు చేయాల్సిరావడం కూడా ఒక ప్రధాన సమస్యగా మారిందని చెబుతున్నారు.
తక్కువ వడ్డీకి రుణాలు కల్పించాలని నిర్ణయించినా.. అందుబాటులోకి రాలేదని తెలిపారు. దీంతో కార్మికుల జీతభత్యాలను చెల్లించడం, ఇతరత్రా నగదు అవసరాలు తీరే మార్గంలేదంటున్నారు.
వ్యవసాయ రంగంతో సమానంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉపాధి కల్పిస్తున్నాయని పారిశ్రామిక వేత్తలు అంటున్నారు. పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి : జోరందుకున్న ఆటోమొబైల్ అమ్మకాలు