జిల్లాలోని ఆసుపత్రుల్లో పదివేల పడకలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ వినయ్‌చంద్ వివరించారు. వీటిలో కొవిడ్ కేసుల కోసం 6568 పడకలు కేటాయించామన్నారు. 1022 పడకలు ఐసీయూలో ఉన్నాయని, 2650 పడకలకు ఆక్సిజన్ సదుపాయం ఉందన్నారు. 710 పడకలకు వెంటిలేటర్ల సదుపాయం ఉందని, 462 వెంటిలేటర్ల పడకలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఐదువార్డులకో అంబులెన్స్
జిల్లాలో ఆక్సిజన్ కొరత లేదని, రోజుకు 40 నుంచి 50 టన్నుల అవసరం కాగా, ప్రైవేటురంగంలో ఉన్న పరిశ్రమలు రోజుకు 100 నుంచి 150 టన్నులు ఉత్పత్తి చేస్తున్నాయని చెప్పారు. స్టీలు ప్లాంటు నుంచి నేరుగా ప్రభుత్వానికి ఆక్సిజన్ వెళుతుందన్నారు. నగరంలో 72 పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయని, ఆయా చోట్ల పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి అయిదు వార్డులకు ఒక అంబులెన్సును సిద్ధంగా ఉంచుతున్నామని, లక్షణాలతో బాధపడే వారు ఆరోగ్య కేంద్రాలకు వెళితే అక్కడే పరీక్షలు చేసి పాజిటివ్ వస్తే ఆసుపత్రులకు తరలిస్తారన్నారు.
టీకా కోసం ఆగాలి
రెండో డోసు వేసుకోవల్సిన వారు 59వేల మంది వరకు ఉన్నారని, కొవిషీల్డు వేసుకొనే వారు రెండో డోసు కోసం 6 నుంచి 8 వారాల పాటు వేచి ఉండాలన్నారు. బుధవారం నుంచి సాధారణ ప్రజలకు టీకాలు వేస్తామని, ఈనెల 19, 20 తేదీల్లో కేవలం హెల్త్‌వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వేస్తున్నామని తెలిపారు.
ఐదుగురికి మించి ఉండకూడదు..
మాస్కులు ధరించని వారిపై 70వేల కేసులు నమోదు చేశామని నగర పోలీసు కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా చెప్పారు. షాపింగ్ కాంప్లెక్సులో అయిదుగురికి మించి ఒకేసారి వెళ్లరాదనే నిబంధన ఉందన్నారు. శ్రీరామనవమి వేడుకల్లో ఎక్కువ మంది పాల్గొనవద్దని, మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేశారు. మద్యం దుకాణాల వద్ద క్యూలు లేకుండా చూస్తున్నామని సీపీ వివరించారు.
ఇదీ చూడండి: