విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో (AU) అమెరికన్ కార్నర్‌ను (American Corner) సీఎం జగన్ (CM Jagan) వర్చువల్‌గా ప్రారంభించారు. యూఎస్ విద్య, ఉద్యోగాంశాల్లో సమాచారం కోసం ఈ కార్నర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రీఫ్‌మెన్ (US Consul General Joel Reefman) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో అమెరికన్ కార్నర్ ఏర్పాటైంది. అమెరికన్ కార్నర్‌ను సీఎం జగన్ తాడేపల్లి నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రీఫ్‌మెన్, మిషన్ డైరెక్టర్ వీణారెడ్డి, ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. దేశంలో అహ్మదాబాద్, హైదరాబాద్ తర్వాత విశాఖపట్నంలో అమెరికన కార్నర్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్‌కు ఇది ఎంతో మేలు చేస్తుందని చెప్పారు.
ఇలాంటి ఒక అద్భుతమైన ఘట్టం ఏయూలో ఆవిష్కృతమయ్యేలా అమెరికన్ కాన్సుల్ జనరల్ జోయల్, యూఎస్ ఎయిడ్ మిషన్ డైరెక్టర్ వీణారెడ్డి ఎంతో కృషి చేశారని సీఎం కొనియాడారు. ఇవాళ మొదలైన ఈ వ్యవస్థ అందరి సహాయ, సహకారాలతో ముందుకు సాగి మరెన్నో సేవలందించాలని కోరుకుంటున్నాన్నారు. అమెరికన్ కార్నర్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఎంతో ప్రయోజనకారిగా నిలుస్తుందని సీఎం తెలిపారు.
అద్భుతంగా అనిపిస్తోంది. మీ సహకారం (అమెరికన్ కాన్సులెట్ జనరల్ జోయల్ రీఫ్‌మన్) మరువలేనిది. ఇదే తరహాలో విశాఖలో అమెరికన్ కాన్సులేట్ ఏర్పాటుకు సహకరించాలి. ఇదే మా లక్ష్యం. ఇది దేశంలో మూడో అమెరికన్ కార్నర్. ఒకటి అహ్మదాబాద్, మరొకటి హైదరాబాద్, మూడోది విశాఖలో ఏర్పాటైంది. ఆంధ్రా యునివర్సిటీలో ఏర్పాటైన అమెరికన్ కార్నర్..నైపుణ్యాల శిక్షణలో లోటును పూడ్చేందుకు ఉపయోగపడుతుంది. మన విద్యార్థులు విదేశాల్లోని గొప్ప యూనివర్సిటీల్లో చదివేందుకు సహకరిస్తుంది. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. మన పిల్లల భవిష్యత్ మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నా.- జగన్, ముఖ్యమంత్రి
యూనివర్సిటీ చరిత్రలో ఒక అద్భుత ఘట్టంలా అమెరికన్ కార్నర్ (American Corner) ప్రారంభోత్సవం నిల్చిందని యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మన్ అన్నారు. ఆంధ్ర, అమెరికా మధ్య బంధం మరింత బలోపేతమవుతుందన్నారు. అమెరికన్ కార్నర్ ఏర్పాటు కావడంలో ఎంతో చొరవ చూపిన రాష్ట్ర ప్రభుత్వంతో పాటు,ఆంధ్ర యూనివర్సిటీ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. విద్య, ఉద్యోగ రంగాలలో యువతకు..ముఖ్యంగా మహిళలకు విస్తృత అవకాశాలు కల్పించడం కోసం ఏపీ ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం రెండూ కట్టుబడి ఉన్నాయన్నారు.
అంతర్జాతీయ స్థాయి నిపుణులతో అవగాహన
విద్యార్థులకు అవసరమయ్యే పలు ఉపయుక్తమైన కార్యశాలలను అంతర్జాతీయ స్థాయి నిపుణులతో ఇక్కడ నిర్వహిస్తారు. అమెరికా వెళ్లాలనుకునే వారు పలు అంశాలపై ఇక్కడ సమగ్ర అవగాహన పొందవచ్చు. అందుకు వీలుగా కార్నర్‌లోని కంప్యూటర్లలో సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. పుస్తకాల సాఫ్ట్ కాపీలతో పాటు, వీడియో క్లిప్పింగులను కూడా సిద్ధం చేశారు. అమెరికా దేశ సంస్కృ తిని తెలిపే అంశాలన్నీ అందుబాటులో ఉంటాయి. అంకుర సంస్థలు ఏర్పాటుకు, వాటిని విజయవంతంగా కొనసాగిం చటానికి అవసరమైన ప్రణాళికలపైనా తగిన అవగాహన కల్పిస్తారు.
ఏయూ పర్యవేక్షణలో..
సెంటర్ నిర్వహణ వ్యవహారాలను ఏయూ పర్యవేక్షిస్తుంది. అందుకు అయ్యే వ్యయాన్ని, కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను అమెరికా రాయబార కార్యాలయ అధికారులు నిర్వహిస్తారు. ఏ కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహిస్తారన్న సమాచారం ముందుగా తెలియజేస్తారు. అవసరాన్ని బట్టి విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. అమెరికాకు సంబంధించిన వివిధ రంగాలపై అవగాహన కల్పించే పుస్తకాలతో మినీ గ్రంథాలయాన్ని సైతం తీర్చిదిద్దారు. మహిళా సాధికారత, సాంకేతిక పరిజ్ఞానాలు, పర్యావరణం తదితర సామాజికాభివృద్ధికి ఉపయుక్తమైన అంశాలకు అగ్రప్రాధాన్యం ఇస్తారు. ఆంగ్ల భాషా నైపుణ్యం పెంచుకోవాలనుకునే వారికి సైతం తగిన సూచనలు చేస్తారు
"ఏయూలో ఏర్పాటు చేసిన అమెరికన్ కార్నర్లో ఆ దేశ అధికారులే కావాల్సిన సమాచారం మొత్తాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. ఇది విద్యార్థులకు వరమే. అమెరికా వెళ్లాలనే కలను సాకారం చేసుకోవడానికి మార్గదర్శిలా కార్నర్ నిలుస్తుంది. దీంతోపాటు పలు సామాజిక అంశాలపై యువతకు అవసరమైన శిక్షణ ఇవ్వడానికి ఇక్కడ ఏర్పాట్లు చేశారు." -వీసీ ఆచార్య పీ.వీ.జీ.డీ. ప్రసాదరెడ్డి
ఇదీచదవండి.