విశాఖ విమానాశ్రయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విమానాశ్రయం వద్ద వైకాపా కార్యకర్తల తీరుతో ప్రజలు భీతిల్లారు. చంద్రబాబును అడ్డుకునేందుకు పలుచోట్ల నుంచి కార్యకర్తలను వైకాపా సమీకరించింది. మాజీ సీఎం చంద్రబాబు వాహనశ్రేణిపై వైకాపా కార్యకర్తలు దాడికి యత్నించారు. కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు విసిరారు. విమానాశ్రయం నుంచి బయటకు రానీయకుండా అడ్డుకునేందుకు వైకాపా కార్యకర్తలు విశ్వ ప్రయత్నం చేశారు.
చంద్రబాబు కాన్వాయ్ ఎదుట బైఠాయించి వైకాపా శ్రేణుల నినాదాలు చేశారు. ఫలితంగా.. విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తాయి. ప్రయాణికులను వేరే వాహనాల్లో పోలీసులు తరలిస్తున్నారు. విశాఖ ఎన్‌ఏడీ కూడలి నుంచి ఎయిర్‌పోర్టు మార్గంలో ప్రజల అవస్థలు పడుతున్నారు. వైకాపా కార్యకర్తల నిరసన కారణంగా విశాఖలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. తెదేపా కార్యకర్తలను విమానాశ్రయం వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.