fingerprint theft in visakhapatnam: బ్యాంకు ఖాతాదారుల వేలిముద్రలను చోరీచేసి వారి ఖాతాల్లోని నగదును అత్యంత సునాయాసంగా మాయం చేస్తున్న ఉదంతాలు విశాఖ నగరంలో వెలుగుచూస్తుండడం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు పోలీసులకు అందిన ఫిర్యాదుల ప్రకారం బాధితులకు చెందిన రూ.1.50కోట్లకు పైగా నగదును వారి ఖాతాల నుంచి దర్జాగా ఉపసంహరించారు. సైబర్ నేరగాళ్లు నేరానికి పాల్పడిన తీరును చూసి పోలీసులు విస్మయానికి గురవుతున్నారు.
జరుగుతోందిలా...
ఏటీఎం కేంద్రాలు లేని చోట్ల కూడా ఖాతాదారులు నగదు ఉపసంహరించడం/జమ చేయడం తదితర సౌకర్యాలను అందుబాటులోకి తేవడానికి వీలుగా బ్యాంకులు ‘ఎఇపీఎస్’(ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చాయి. ఈ వ్యవస్థలో భాగంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రైవేటు వ్యక్తులకు ‘కస్టమర్ సర్వీస్ పాయింట్’ (సీఎస్‌పీ)లు పెట్టుకునే అవకాశం కల్పించారు. ఆయా కేంద్రాలు నిర్వహించేవారికి ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అందించారు. బ్యాంకు ఖాతాదారులు ఆయా కేంద్రాలకు వెళ్లి వేలిముద్ర వేసి వారి ఖాతా నుంచి నిర్ణీత మొత్తాన్ని తీసుకోవచ్చు. ఎవరి బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానమై ఉంటుందో వారికి మాత్రమే ఈ వెసులుబాటు అందుబాటులో ఉంది. ఖాతాదారులు వేసిన వేలిముద్రల ఆధారంగా సీఎస్‌పీ నిర్వాహకులు వారి బ్యాంకు ఖాతాలో నగదు నిల్వ ఉంటే అవసరమైన మొత్తాన్ని అందజేస్తారు. సీఎస్‌పీ నిర్వాహకుడు అందించిన సేవలకు గానూ బ్యాంకు అధికారులు కొంత కమిషన్‌ను చెల్లిస్తారు.
బయోమెట్రిక్ లాక్ చేసుకోకపోవడమే కారణం..
బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించిన విషయం తెలిసిందే. ఆ విధంగా అనుసంధానం చేసుకున్నవారు వారి బయోమెట్రిక్‌ను ‘లాక్’ చేసిన స్థితిలో ఉంచాలి. maadhar యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ‘బయోమెట్రిక్’, ‘ఆధార్’ అనే ఆప్షన్లను లాక్ చేసుకోవచ్చు. బ్యాంకు అధికారులకు చెప్పి కూడా ఆధార్ వివరాలను లాక్ చేయించుకోవచ్చు. ఆ విధంగా లాక్ చేసి ఉంచితే ఖాతాదారుల ఆధార్ ఆధారంగా ఇతరులు ఎలాంటి లావాదేవీలు నడపడానికి అవకాశం ఉండదు. ఒకవేళ ఏమైనా లావాదేవీలు నిర్వహించాల్సి వస్తే ముందుగా ఖాతాదారులకు సమాచారం వస్తుంది. చాలామంది బ్యాంకు ఖాతాదారులు వారి ఆధార్ వివరాలను ‘లాక్’ చేయించుకోవడంలో విఫలమవుతుండడం సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతోంది.
అక్రమం ఇక్కడే...
సైబర్ నేరగాళ్లు సీఎస్‌పీల వ్యవస్థలో ఉన్న లోపాలను పసిగట్టారు. కేవలం వేలిముద్ర ఆధారంగా నగదు చెల్లిస్తుండడాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నుంచి సైబర్ నేరగాళ్లు పలువురి వేలిముద్రలను చోరీ చేశారు. ఆయా వేలిముద్రల ఆధారంగా సైబర్ నేరగాళ్లు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లోని సి.ఎస్.పి. కేంద్రాల్లో నగదును ఉపసంహరించేస్తున్నారు. ఖాతాదారులు స్పందించి బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసే లోపే వారి ఖాతాల్లోని నగదు మొత్తం ఖాళీ అవుతోంది.
వేలి ముద్రల చోరీపై పోలీసుల దర్యాప్తు
సైబర్ నేరగాళ్లు విశాఖ నగరవాసుల వేలిముద్రలను ఏవిధంగా చోరీ చేశారన్న వివరాలను సైబర్‌క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయా కేసుల్లో నిందితులెవరన్నది పట్టుబడేవరకు వేలిముద్రలు ఏవిధంగా చోరీచేశారన్న వివరాలు బయటపడే అవకాశం కనబడడంలేదు. వేలిముద్రలున్న పుస్తకాలు చోరీ జరిగినట్లు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ కార్యాలయాల సిబ్బందితో కుమ్మక్కై వేలిముద్రలను సేకరించారేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు.
బ్యాంకులు నగదు చెల్లించాల్సిందే....
ఖాతాదారుడి ప్రమేయం ఏమాత్రం లేకుండా వారి ఖాతాల నుంచి సైబర్ నేరగాళ్లు నగదు బదలాయిస్తున్నారు. ఖాతాదారులు సమర్పించిన ఆధార్ కార్డుల్లోని వేలిముద్రలను ఉపయోగించి వారు నగదును బదలాయిస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. సైబర్ నేరగాళ్లకు ఆయా వేలిముద్రలు ఎలా వెళ్లాయన్న కోణంలో సైబర్ క్రైం సీఐ కె.భవానీప్రసాద్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది. ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి మోసానికి బాధ్యులైన వారిని గుర్తించేలా చర్యలు చేపట్టాం. నగదు కోల్పోయిన ఖాతాదారులు వారివారి బ్యాంకులకు దరఖాస్తు చేసుకుంటే ఆ నగదు వెనక్కి వస్తుంది. - సీహెచ్.శ్రీకాంత్, నగర పోలీసు కమిషనర్, విశాఖపట్నం
ఇవీ చదవండి:
- లేపాక్షి భూములు రైతులకివ్వాలి.. హిందూపురం పీఎస్ ఎదుట అఖిలపక్ష నేతల ఆందోళన
- 2023 మార్చిలోపు అమరరాజా వ్యాపారాల విలీనం.. 2025కల్లా రూ.3వేల కోట్ల టర్నోవర్
- చక్కనమ్మ ఏ డ్రస్ వేసినా అందమే.. ఏ ఫోజు పెట్టినా చందమే