BJP leaders GVL and Somu Veerraju: విశాఖ కోసం రాజీనామాలు చేస్తామని చెప్పినవారు.. విశాఖకు వాళ్లు చేసిన అభివృద్ధి ఏంటో శ్వేతపత్రం విడుదల చేయాలని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం రాజధానిని నిర్మించకుండా.. ప్రజల దృష్టి మళ్లించే పనులు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం.. ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తే తెదేపా, వైకాపాలు ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని నిలదీశారు. 2024 వరకు హైదరాబాద్లో ఉండే హక్కు ఇస్తే.. ఎందుకు వదిలేశారో చెప్పాలని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సచివాలయంలో భవనాలు ఎందుకు ఇచ్చేశారో చెప్పాలని అడిగారు.
ఇప్పుడు కేసీఆర్... బీఆర్ఎస్గా ఇక్కడ పోటీ చేస్తామంటున్నారని.. రాష్ట్ర విభజన బాధలోనే ఇంకా ఏపీ ప్రజలు ఉన్నారని అన్నారు. విశాఖ అభివృద్ధిలో వైకాపా పాత్ర ఏం లేదని కేవలం భూదందాలు, భూములను కొట్టేయడం తప్ప.. మరేమీ చేయలేదని ఆగ్రహించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప.. విశాఖలో వైకాపా ఏం చేసిందని ప్రశ్నించారు. వైజాగ్- చెన్నై పారిశ్రామిక కారిడార్ భూసేకరణ కూడా చేయలేకపోయారని విమర్శించారు. ఈ కారిడార్ వస్తే విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ రాష్ట్రంలో సొంతపార్టీని చూసుకోవడం మానేసి.. భాజపాపై దృష్టి పెడుతున్నారని ఎద్దేవా చేశారు.
చైనా విధానాన్ని రాష్ట్రంలో అనుసరించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. చైనా రాజధాని బీజింగ్గా ఉన్నపటికీ.. షాంఘైని అభివృద్ధి చేస్తున్నారని.. అమరావతి రాజధానిగా ఉన్నా విశాఖను అభివృద్ధి చేయొచ్చన్నారు. అమరావతిని అభివృద్ధి చేస్తానని చంద్రబాబు హైదరాబాద్లోనే కూర్చున్నారని విమర్శించారు. జగన్... అమరావతిలో ఉంటానని తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని.. మూడు రాజధానులు అంటున్నారని దుయ్యబట్టారు.
ఎన్నికల ముందు ఎందుకు మూడు రాజధానుల ఊసు ఎందుకు ఎత్తలేదో చెప్పాలన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము, క్యారెక్టర్ తమకుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైకాపా రూలింగ్ కాదని... ట్రేడింగ్ చేస్తోందని విమర్శించారు. దసపల్లా భూముల వ్యవహారంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన విచారణ సంస్థతో విచారణ జరిపించాలని.. దసపల్లా భూముల మీద సుప్రీంకోర్టులో కూడా ఒక రివిజన్ పిటిషన్ వేయాలని కోరుతున్నట్టు చెప్పారు.
ఇవీ చదవండి: