SOMU VEERRAJU ON 26 DISTRICTS: రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చడానికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని అకస్మాత్తుగా తెరపైకి తెచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. కొత్త జిల్లాల ఏర్పాటు చేసే ముందు.. ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు అవసరమే అన్న వీర్రాజు.. మౌలిక సదుపాయాలు సమకూర్చుకోకుండా కొత్త జిల్లాల ఏర్పాటు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2014 నుంచి జిల్లాల సంఖ్య పెంచమని భాజపా డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 26 జిల్లాల ఏర్పాటు విషయంలో.. జిల్లాల వారీగా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని.. అందుకోసం ప్రత్యేకంగా ఒక కమిటీని వేయాలని వీర్రాజు కోరారు. ముందుగా ప్రభుత్వం వివిధ జిల్లాల్లోని ప్రజల కోరిక తెలుసుకోవాలని అన్నారు. నూతనంగా ఏర్పాటు చేసే జిల్లాలకు ఎన్టీఆర్, అల్లూరి, ఉయ్యాలవాడ, తెన్నేటి విశ్వనాథం పేర్లు పెట్టాలని.., ప్రజల కోరుకుంటున్నట్లుగా.. వంగవీటి రాధ పేరు పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.
సీఎంకు రాష్ట్ర అభివృద్ధి కంటే.. సొంత ఎజెండా అమలు చేసేందుకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. కొత్త జిల్లాల ఏర్పాటులో.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నిజాయితీ లేదని సోము వీర్రాజు దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా జగన్ దివాలాతీయించారని.. ప్రజలు మెజారిటీ ఇవ్వడాన్ని ఆసరాగా చేసుకుని.., ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు రాష్ట్ర భాజపా వ్యతిరేకమని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ పోదని.. మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. 15 ఏళ్లుగా కేంద్రం నష్టాలను భరిస్తోందని.. పాయకరావుపేట చక్కెర కర్మాగారాన్ని సీఎం జగన్ అమ్మాలని చూస్తున్నారని వివరించారు.
రాష్ట్రంలోని గనులన్నీ ముఖ్యమంత్రి అనుయాయులు చేతుల్లోనే నడుస్తున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వైకాపా నాయకుల అండదండలతో.. విచ్చలవిడిగా ఇసుక దందా నడుస్తోందని ఆయన ఆరోపించారు. నేటి వరకు రాష్ట్రంలో.. గంజాయిని ప్రభుత్వం ఎందుకు అదుపు చెయ్యలేకపోయిందని.. భయపడా లేక పట్టుకునే సత్తా లేకనా.. తమకు అర్థం కావడం లేదని అన్నారు.
ఇదీ చదవండి: CHANGES IN ROAD WIDTH: రోడ్డు వెడల్పు కుదింపునకు గ్రీన్ సిగ్నల్.. వెల్లువెత్తుతున్న వ్యతిరేకత
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!