విశాఖ కైలాసగిరి సమీపంలోని తెన్నేటి పార్కు ఒడ్డుకు కొట్టుకు వచ్చిన బంగ్లాదేశ్ వాణిజ్య నౌక ఎంవీహెచ్టీ 194 కార్గోను.. ఇప్పుడు సురక్షితంగా తిరిగి జలాల్లోకి పంపడం సవాలుగా మారింది. పూర్తిగా రాళ్లతో ఉన్న ఈ సాగర తీరం నుంచి సముద్రంలోకి ఎలా తీసుకువెళ్లగలరన్న అంశంపైన కసరత్తు సాగుతోంది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావం వల్ల ఈనెల 12న ఆర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ బంగ్లా వాణిజ్య నౌక ఒడ్డుకు కొట్టుకువచ్చింది. గత 3, 4 వారాలుగా యాంకరేజి పోర్టులో ఉన్న ఈ నౌక 2 యాంకర్లు తెగిపోయి ఒడ్డుకు వచ్చేసింది. ఇందులో 15 మంది సిబ్బంది ఉన్నారు. తీవ్రగాలులకు దిశ లేకుండా ఈ నౌక ఊగిపోయింది.
యాంకర్లు తెగిపోయి.. ఇంజిన్లో లోపాలతో..
నెల క్రితం బంగ్లా నుంచి కార్గో తీసుకువచ్చిన ఈ నౌక తిరిగి వేరే కార్గో తీసుకువెళ్లేందుకు యాంకరేజి పోర్టులో 2 వారాలుగా ఎదురు చూస్తోంది. స్టీవ్ డోర్స్ కంపెనీకి.. కార్గోకి సంబంధించి అనుమతులు రాకపోవడం వల్ల ఈ నౌక ఇన్నర్ హార్బర్లోకి రాకుండా వేచి ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలో వాయుగుండం ప్రభావంతో గాలుల తీవ్రతకు 2 యాంకర్లు తెగిపోయాయి. దీనికితోడు ఇంజిన్లో లోపాలు ఉండడం వల్ల సముద్ర తీరానికి కొట్టుకువచ్చింది. తెన్నేటి పార్క్ వద్దకు తీరానికి కొట్టుకు వచ్చిన బంగ్లాదేశ్ వాణిజ్య నౌక 80 మీటర్ల పొడవు ఉంది. పార్క్ సమీపంలోని రాళ్లలో చిక్కుకున్న నౌకను చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున వస్తున్నారు.
అప్పుడూ ఇలానే
ఇలాంటి సంఘటన 1964 -65లో విశాఖ మెరీనా హోటల్ ముందు సముద్రతీరంలో జరిగిందని అధికారులు చెప్తున్నారు. అప్పుడు కూడా కార్గో నౌక ఒడ్డుకు వచ్చింది. దాన్ని తిరిగి సముద్రంలోకి పంపాలని ప్రయత్నం చేశారు కానీ ఫలించలేదు. ఆఖరికి నౌకను ముక్కలుగా చేశారు. ఆ నౌక పేరు "జగ్ సేవక్". దానిని ఔటర్ హర్బర్కు అడ్డుగా ఉందని తొలగించారు. అందులో సుమారు 20 వేల టన్నుల సిమెంట్ గడ్డ కట్టుకుపోయింది. ఆ ఓడను తొలగించడానికి ముక్కలు చేయాల్సి వచ్చింది.. స్మిత్ టెక్ ఇంటర్నేషనల్ అనే నెదర్లాండ్స్ కంపెనీ ఆ పని చేసిందని అధికారులు వివరించారు. అందులో 110 టన్నుల శకలాన్ని తొలగించేందుకు భీమ, హనుమానే అనే రెండు భారీ క్రేన్లు ఉపయోగించినట్లు తెలిసింది.
ఇప్పుడు కొట్టుకువచ్చిన బంగ్లా నౌకలో సరకు ఏంలేదు. అయితే దీన్ని ఏ విధంగా తిరిగి సముద్రంలోని తీసుకెళ్లాలన్న అంశంపై కోస్ట్ గార్డు, కేంద్ర సముద్ర వాణిజ్య శాఖలు.. ఆయా నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. కనీసం 2 వారాల తర్వాతగానీ దీనిపై ఒక అంచనాకు రాలేమని తెలిపారు.
ఇవీ చదవండి..