కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో విశాఖ సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దర్శనాలపై అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి కేవలం రెండు గంటలు మాత్రమే భక్తుల దర్శనాలకు అవకాశం కల్పించనున్నట్లు దేవస్థానం ఈవో ఎంవీ.సూర్యకళ తెలిపారు. ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల మధ్య మాత్రమే భక్తులు స్వామిని దర్శించుకోవాలని సూచించారు. రెండు రోజులు ఉదయం 6.30 నుంచి 11.30 గంటల వరకు అయిదు గంటల పాటు భక్తులకు దర్శనాలు కల్పించారు. 14న జరగనున్న చందనోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో దశల వారీగా భక్తుల దర్శనాలను కుదిస్తూ వచ్చారు.
ఇదీ చదవండి: లోపాలున్నాయ్ సరిదిద్దుకోండి.. చేతులు ముడుచుకొని కూర్చోవద్దు: హైకోర్టు