హెర్బల్ ఉత్పత్తుల పేరిట అమెజాన్‌లో గంజాయి విక్రయించిన కేసులో (Ganja Smuggling through Amazon From visaka) విశాఖలో ఐదుగురిని, మధ్యప్రదేశ్‌లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్ఈబీ అధికారులు వెల్లడించారు. ఎస్ఈబీ జేడీ సతీశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ ద్వారా హెర్బల్ ఉత్పత్తులు, కరివేపాకు పేరిట విశాఖ నుంచి మధ్యప్రదేశ్‌తోపాటు ఇతర ప్రాంతాలకు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటివరకు దాదాపు 600 కేజీల గంజాయి అక్రమంగా రవాణా జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఈ కేసులో ఇద్దరు అమెజాన్ డెలివరీ బాయ్స్ పాత్ర ఉందని వెల్లడించారు. కేసు దర్యాప్తు ముమ్మరం చేసి, నిందితులు చిలకపాటి శ్రీనివాసరావు, జీరు కృష్ణమూర్తి, బిజ్జం కృష్ణంరాజు, చీపురుపల్లి వెంకటేశ్వరరావు, చిలకపాటి మోహన్ రాజును అరెస్ట్ చేసినట్టు ఎస్ఈబీ జేడీ వెల్లడించారు. వీరి నుంచి 48 కిలోల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషీన్, గంజాయి ప్యాకింగ్ మెటీరియల్, అమెజాన్ టేపులు, బ్యాగ్స్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. సూరజ్, ముకుల్ జైస్వాల్‌లను మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో అరెస్ట్ చేసినట్లు సతీశ్ కుమార్ స్పష్టం చేశారు.
గంజాయి రవాణా చేస్తున్న వాహనం బోల్తా..
విశాఖ (Ganja Smuggling From Amazon news) జిల్లా పెదగరువు వంతెన వద్ద గంజాయి రవాణా చేస్తున్న బొలెరో వాహనం బోల్తా పడింది. గంజా మూటలు బయటపడటంతో వాహన డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పాడేరు ఏజెన్సీ నుంచి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి