విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై వాస్తవాలు తేల్చేందుకు కమిటీ వేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఎల్‌జీ పాలిమర్స్‌లో సంస్థలో జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై కమిటీ లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందని చెప్పారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఘటన జరిగిన వెంటనే కలెక్టర్, డీసీపీ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. 340 మందికిపైగా స్థానికులను ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించారు. అస్వస్థత నుంచి చాలా మంది కోలుకున్నారన్నారు.
కోటి పరిహారం వచ్చేలా చూస్తాం
విశాఖ మృతుల కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. ఆయా కుటుంబాలకు కంపెనీ నుంచి రూ.కోటి పరిహారం వచ్చేలా చూస్తామని అన్నారు. రెండు, మూడ్రోజులపాటు ఆస్పత్రుల్లో ఉన్నవారికి రూ.లక్ష పరిహారం ఇస్తామని తెలిపారు. వెంటిలేటర్ సాయంతో చికిత్స తీసుకునే వారికి రూ.10 లక్షలు.. స్వల్ప అస్వస్థతకు గురైన వారికి రూ.25 వేలు పరిహారం ఇస్తామని వెల్లడించారు. పశువులు నష్టపోయిన వారికి రూ.20 వేలు చొప్పున సాయం చేస్తాం. కమిటీ నివేదిక మేరకు మృతుల కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పిస్తాం.
సీఎం ఇంకా ఏమన్నారంటే..
- లీకైన గ్యాస్ ప్రభావం కొన్ని రోజులపాటు ఉంటుంది.
- వెంకటాపురం, ఎస్సీ, బీసీ కాలనీ, నందమూరి నగర్, పద్మనాభపురంలో గ్యాస్ ప్రభావం ఉంది.
- ప్రభావిత గ్రామాల్లో సుమారు 15 వేల మంది ప్రజలకు రూ.10 వేలు చొప్పున సాయం చేస్తాం.
- ప్రభావిత గ్రామాల్లో నాణ్యమైన భోజనం ఇవ్వాలి
- మంత్రులు, అధికారులు దగ్గరుండి సహాయ చర్యలు పర్యవేక్షిస్తారు
- బాధితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తాం.
- ఎల్‌జీ కంపెనీ మంచి ప్రమాణాలు పాటించే సంస్థ. అవసరమైతే కంపెనీని అక్కణ్నుంచి తరలిస్తామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి..