ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ సాయంత్రం బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ హాలులో జరగనున్న ప్రధాన కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. టెక్ మహీంద్రా సీఈవో గుర్నాని గౌరవ అతిథిగా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఏడాది సదస్సుకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల తొలి బ్యాచ్ విద్యార్థులు హాజరవడం ప్రత్యేక ఆకర్షణ కానుంది.
ఏయూ ఖ్యాతి మరింత పెరుగుతుంది: వీసీ ప్రసాద్ రెడ్డి
ఏయూ ఖ్యాతిని మరింత పెంచేందుకు అల్యూమ్ని సదస్సు నిర్వహణ ఎంతగానో దోహదపడుతుందని వర్శిటీ ఉపకులపతి ప్రసాద్‌రెడ్డి అన్నారు. పూర్వ విద్యార్థుల సహకారంతో ప్రపంచ శ్రేణి వర్సిటీగా ఏయూ అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏయూ అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని... ఇంజినీరింగ్ కళాశాలలో సీట్ల సంఖ్యను రెట్టింపు చేసేందుకు ఆయన అనుమతించడం ఎంతో మంది విద్యార్థులకు మేలు చేసిందన్నారు.
పూర్వ విద్యార్థుల సదస్సు కోసం ఏయూ ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుత్ దీపాల కాంతుల ధగధగలతో పూర్వ విద్యార్థులకు ఆతిథ్యమివ్వనుంది. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో ఏయూకి చేరుకోనున్న పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న విభాగాల్లో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించుకోనున్నారు.
ఇదీ చదవండి : సాంకేతికతతో.. కచ్చితమైన వాాతావరణ సమాచారం...