Sri Lakshmi Tirupatamma Kalyanostavam in Penuganchiprolu of NTR District: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కల్యాణోత్సవం మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై తిరుపతమ్మ గోపయ్య స్వాముల విగ్రహాలను ఉంచి అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారి వంశీయులు కాకాని వల్ల కొల్ల వారి దంపతులు పీటలపై కూర్చొని కల్యాణం తంతు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేసి కళ్యాణంలో పాల్గొన్నారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీలలో వేలాదిమంది కూర్చొని కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. సుమారు లక్ష మంది భక్తులు హాజరయ్యారు. ఈ కళ్యాణోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను విజయవాడ డీసీపీలు గౌతమి శాలి, మహేశ్వర రాజు ఆధ్వర్యంలో పర్యవేక్షించారు.
500 మంది పోలీసులు వీధుల్లో బందోబస్తు నిర్వర్తించారు. ఏడు డ్రోన్లు, 40 ప్రత్యేక సీసీ కెమెరాలను కళ్యాణ వేదిక వద్ద భక్తుల రద్దీని అనుక్షణం పర్యవేక్షించారు. కళ్యాణానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, ఆలయ అధికారులు పటిష్ట చర్యలను చేపట్టారు.
రామతీర్థంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు - భారీగా తరలివచ్చిన భక్తులు - SRIRAMA NAVAMI CELEBRATIONS