అడవిని హరింపజేసే చర్యలకు అడ్డుకట్ట వేయడమే ఇప్పుడు మన లక్ష్యం. నగరాలు, పట్టణాల్లో తక్కువ నేల పరిధిలో చిట్టడవులను పెంచే ప్రక్రియను మెుదలుపెడితే...పచ్చదనం పెరుగుతుంది. అలాంటి పద్ధతే విశాఖలో నడుస్తోంది. పావు ఎకరంలో జపాన్ పద్ధతిలో చిట్టడవుల పెంపకం జరుగుతోంది.
ఆచార్యుడు కృషి ఫలితమే
జపాన్ పద్ధతిలో చిట్టడవులను పెంచే విధానాన్ని అకిరమియవకి అంటారు. ఈ విధానం ద్వారా పావు ఎకరంలో మూడు వేల మొక్కలు నాటి వాటినీ అతి తక్కువ కాలంలో ఏపుగా ఎదిగేలా చూసుకుంటోందీ విశాఖలోని రాంపురం సంపద తయారీ కేంద్రం. జపాన్ కు చెందిన అకిరమియవకి అనే ఆచార్యుడు సేంద్రియ విధానంలో పరిమిత స్థలంలో తక్కువ నీటితో ఎక్కువ మొక్కలను పెంచే విధానంతో మంచి ఫలితాలను తీసుకురాగలిగారు. ఈ హైడెన్సిటీ మొక్కల పెంపకాన్ని అకిరమియవకి విధానంగా పిలుస్తారు.
3వేల మెుక్కలు
ఈ సంపద తయారీ కేంద్రం ఆవరణలో 10 ట్రెంచ్‌లు ఏర్పాటు చేసి...ఒక్కో ట్రెంచ్కి 300 మొక్కలు చొప్పున పావు ఎకరం స్థలంలో మూడు వేల మొక్కలు నాటి విజయం సాధించారు. గతేడాది డిసెంబర్లోనే ఈ విధానానికి నాంది పలికారు. తీవ్రమైన ఎండను సైతం తట్టుకొని మొక్కలు పెరగడానికి కారణం సేంద్రీయ పద్ధతిలో మొక్కలను పెంచడమే. నీడనిచ్చే చెట్లే కాదు.. పండ్ల మెుక్కలు సైతం...ఇక్కడ పెరుగుతున్నాయి.
అకిరమియవకి విధానం ద్వారా మొక్కలు నాటే సమయంలో గోమూత్రంలో మొక్కలను ముంచి చీడపీడలు రాకుండా చూసుకున్నారు. వరి ఊక వేసి మొక్కలు నాటి వర్మీ కంపోస్ట్, కొబ్బరిపీచు, పొడి ముక్కలు అవసరమైన పోషకాలను అందించడం వలన ఏపుగా పెరిగాయి.